గొలుసు దొంగగా మారిన బిజినెస్ మ్యాన్.. పట్టిచ్చిన షూస్

  • సంపన్న కుటుంబంలో పుట్టి చైన్ స్నాచర్ గా మారిన వైనం
  • ఆన్ లైన్ జూదం వ్యసనంతో అప్పులపాలైన బిజినెస్ మ్యాన్
  • అప్పులు తీర్చేందుకు దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడి
సంపన్న కుటుంబంలో పుట్టినా చెడు అలవాట్ల వల్ల ఓ యువకుడు అప్పుల పాలయ్యాడు.. అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచర్ గా మారి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లాడు. ఎప్పటికప్పుడు దుస్తులు మార్చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. దుస్తులు మార్చినా కూడా తను వేసుకున్న షూ మార్చకపోవడంతో పోలీసులకు దొరికిపోయాడు. ముంబైలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ చైన్ స్నాచర్ ను అతడు వేసుకున్న షూ పట్టించాయి.

వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సియాన్ ఏరియాకు చెందిన మోహన్ కొకాటే గతంలో గార్డెనింగ్ వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే.. పెద్ద పెద్ద హోదాలో ఉన్నవారే. మోహన్ మాత్రం ఆన్ లైన్ జూదానికి బానిసయ్యాడు. జూదం ఆడేందుకు విపరీతంగా అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు చైన్ స్నాచర్ అవతారమెత్తాడు. గతంలోనూ మోహన్ కు నేరచరిత్ర ఉంది. 2011లో జైలుకు కూడా వెళ్లాడు. బయటికి వచ్చాక కొంతకాలం నేరాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుల కారణంగా మరోమారు దొంగగా మారాడు.

దొంగిలించిన బైక్ పై ప్రయాణిస్తూ మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లాడు. ముఖానికి హెల్మెట్ ధరించడం, ఎప్పటికప్పుడు దుస్తులు మార్చడంతో మోహన్ ను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లోని 80 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. దొంగతనం జరిగిన ప్రతిచోటా దొంగ వేర్వేరు దుస్తుల్లో కనిపించాడు. అయితే, అన్నిచోట్లా ఒకే రకమైన షూ ధరించాడు. ఈ క్లూ ఆధారంగా పరిశోధన జరిపిన పోలీసులు.. దొంగిలించిన బైక్ ను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుండగా మోహన్ ను గుర్తించి అరెస్టు చేశారు.


More Telugu News