త్వరలోనే మలేషియాలో తొలి భారత కాన్సులేట్... ప్రధాని మోదీ ప్రకటన

భారత్, మలేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. మలేషియాలో త్వరలోనే తొలి భారత కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శనివారం కౌలాలంపూర్‌లో జరిగిన 'సెలామత్ దతాంగ్ మోదీజీ' కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి మోదీ హాజరయ్యారు.

కాన్సులేట్ ఏర్పాటు నిర్ణయంతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ చొరవతో మలేషియాలోని భారతీయ సమాజంతో సంబంధాలు మరింత విస్తృతం అవుతాయని భారత విదేశాంగ శాఖ (MEA) తెలిపింది. ప్రధాని ప్రకటనపై అక్కడి ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆరో తరం వరకు ఉన్న మలేషియాలోని భారత సంతతి పౌరులకు ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI) కార్డుల అర్హతను పొడిగించడంపై ప్రవాస భారతీయులు సంతోషంగా ఉన్నారని మోదీ తెలిపారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, మలేషియా అభివృద్ధికి, ఇరు దేశాల స్నేహాన్ని బలోపేతం చేయడంలో భారత సంతతి ప్రజల పాత్రను కొనియాడారు. భారత్-మలేషియా భాగస్వామ్యాన్ని ఆయన 'ఇంపాక్ట్' (IMPACT – India Malaysia Partnership For Advancing Collective Transformation)గా అభివర్ణించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్రను గుర్తుచేసుకుంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించారు. ఆహారపు అలవాట్ల నుంచి భాష వరకు ఇరు దేశాల మధ్య అనేక సాంస్కృతిక సారూప్యతలు ఉన్నాయని గుర్తుచేశారు.

ఈ పర్యటనలో భాగంగా మరికొన్ని కీలక ప్రకటనలు కూడా చేశారు. కౌలాలంపూర్‌లోని యూనివర్సిటీ మలయాలో ప్రత్యేకంగా 'తిరువళ్లువార్ సెంటర్' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు విద్యార్థుల కోసం తిరువళ్లువార్ స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలోనే యూపీఐ చెల్లింపుల సౌకర్యం మలేషియాలోనూ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 800 మంది కళాకారులతో ప్రదర్శించిన భారత సంప్రదాయ నృత్య ప్రదర్శన మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం విశేషం.


More Telugu News