ఇది ఒక భవనానికి పునాది కాదు... భవిష్యత్తుకు పునాది: నారా లోకేశ్

  • అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన
  • టెక్నాలజీలో భారత్ భవిష్యత్ నాయకత్వానికి ఇది పునాది అన్న లోకేశ్
  • సీఎం ముందుచూపు అద్భుతం అని కితాబు
  • ఇతరులు ఇంకా ఆలోచనల వద్దే ఉంటే, సీఎం ఆచరణలో పెడుతున్నారని వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేయడం కేవలం ఒక భవనానికి పునాది రాయి వేయడం కాదని, క్వాంటం టెక్నాలజీ రంగంలో భారతదేశ భవిష్యత్ నాయకత్వానికి ఇక్కడే పునాది వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. శనివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత వల్లే ఇది సాధ్యమవుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, స్టార్టప్ ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

చరిత్ర పునరావృతం అవుతుంది
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "కొన్నేళ్ల క్రితం ప్రపంచం సాఫ్ట్‌వేర్ సేవల గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు, ఒక దార్శనిక నాయకుడు 'హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ రాజధానిగా ఎందుకు మార్చకూడదు?' అని ధైర్యంగా ప్రశ్నించారు. ఆ ఒక్క ప్రశ్న చరిత్రను మార్చేసింది. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌కు వచ్చాయి, లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఒక నగరం రూపురేఖలే కాకుండా ప్రపంచంలో భారతదేశ స్థాయినే మార్చేసిన ఐటీ విప్లవం మొదలైంది. ఆ దార్శనిక నాయకుడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు" అని వివరించారు.

"ఈ రోజు, మరింత లోతైన సాంకేతికతలు, పెద్ద సవాళ్లు, గొప్ప అవకాశాలతో నిండిన కొత్త శకంలో, ఆయన మరో కీలక ప్రశ్న సంధించారు. 'భారత్ క్వాంటం విప్లవాన్ని అనుసరించడం కాదు, ఎందుకు నాయకత్వం వహించకూడదు?' అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ అమరావతి క్వాంటం వ్యాలీ" అని లోకేశ్ ఉద్ఘాటించారు.

సీఎం ముందుచూపు అమోఘం
ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంటూ, "ముఖ్యమంత్రి గారు ప్రొఫెసర్ కామకోటి గారితో సమావేశం తర్వాత నన్ను పిలిచి, క్వాంటం ఎకోసిస్టమ్‌ను సృష్టించాలని చెప్పారు. అప్పుడు నేను వెంటనే నా ఫోన్ తీసి, 'క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటో ఒక పేజీలో వివరించండి' అని చాట్‌జీపీటీని అడిగాను. ఆ సమాధానం చూశాక, తర్వాతి తరం టెక్నాలజీ ఎక్కడ ఉందో అర్థం చేసుకోవడంలో మన సీఎం అంత ముందున్నారన్న విషయం అర్థమైంది. ఇతరులు క్వాంటం అంటే ఏమిటో ఇంకా చర్చిస్తుంటే, ఈ మిషన్‌కు భారతదేశం ఎలా నాయకత్వం వహించాలనే దానిపై మన ముఖ్యమంత్రి అప్పుడే ప్రణాళికలు రచిస్తున్నారు. అదే ఆయన నాయకత్వ పటిమ, ముందుచూపు" అని లోకేశ్ ప్రశంసించారు.

మాది బుల్లెట్ ట్రైన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న రెండు ప్రధాన బలాల గురించి లోకేశ్ వివరిస్తూ, "మొదటిది, నిరూపితమైన ట్రాక్ రికార్డ్ ఉన్న చంద్రబాబు గారి నాయకత్వం. ఇక్కడికి వచ్చే పెట్టుబడిదారులు కేవలం వాగ్దానాలు వినరు, చరిత్ర సృష్టించడం చూస్తారు. రెండవది, పనులను పూర్తి చేయడంలో మాకున్న అసమానమైన వేగం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 'డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' ఉంది" అని అన్నారు.

ఈ వేగానికి రెండు ఉదాహరణలు ఇస్తూ, "దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ అయిన 15 బిలియన్ డాలర్ల గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును 12 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం. కేవలం ఒక నెల ఆలస్యమైనా, 13 నెలల్లోనే పూర్తి చేసి చరిత్ర సృష్టించాం. మరో రాష్ట్రంలో దశాబ్దానికి పైగా నిలిచిపోయిన ఆర్సెల్ మిట్టల్ ప్రాజెక్టును కేవలం ఏడాది వ్యవధిలోనే ఏపీలో పూర్తి చేసి చూపించాం. ఇతర చోట్ల అసాధ్యం అనిపించింది ఇక్కడ వాస్తవరూపం దాల్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒకసారి కమిట్ అయితే, దార్శనికతకు వేగం తోడవుతుంది" అని వివరించారు. రాష్ట్రానికి వచ్చే ఏ ప్రాజెక్టునైనా తమ ఉమ్మడి ప్రాజెక్టుగా భావించి, అడ్డంకులు తొలగించి, అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.


More Telugu News