పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు

  • ఈ ఆత్మహత్య కేసులో తమకు ఇప్పటి వరకు అనుమానాలు లేవన్న సోదరుడు చిరంజీవి
  • కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం
  • హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తామన్న సోదరుడు చిరంజీవి
తన ఇద్దరు పిల్లలతో కలిసి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి కేసులో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆమె సోదరుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు.

హైదరాబాద్‌లోని చర్లపల్లిలో గత వారం విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే విషయం వెల్లడి కాలేదు. అయితే ఈ ఘటనపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని సోదరుడు చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయా ఛానళ్లపై ఫిర్యాదు చేయడానికి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయారెడ్డి, పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డి మృతిపై తాము డిప్రెషన్‌లో ఉన్నామని ఆయన అన్నారు. తనన చెల్లెలు ఆఫీసు వర్కుతో బిజీగా ఉండేదని, కంపెనీలో టీమ్ లీడర్ కాబట్టి 14 మందిని లీడ్ చేసేదని, దాంతో ఆమెపై డిప్రెషన్ ప్రభావం ఉండేదని అన్నారు. ముగ్గురి మరణంపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. మాపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేయడానికి వస్తే కోర్టుకు వెళ్లమని పోలీసులు చెప్పారని, హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తామని అన్నారు.

విజయా రెడ్డి డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలను పోలీసులు ఖండించారు. ఈ ముగ్గురి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని, విచారణ జరుపుతున్నామని అన్నారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


More Telugu News