ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం

  • కంచికచర్ల మండలం కీసర వద్ద ఘటన 
  • వెనుక భాగం నుంచి పొగ, మంటలు కనిపించడంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసిన డ్రైవర్
  • వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి దించిన వైనం
  • ప్రయాణికులు దిగిన క్షణాల్లోనే మంటల్లో కాలిపోయిన బస్సు
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు దగ్ధం అయినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

విషయంలోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. వెనుక నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు నిలిపివేసి ప్రయాణికులను క్షణాల్లో బయటకు దించాడు. అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న మొత్తం 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. 

డ్రైవర్ తీసుకున్న సత్వర నిర్ణయంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు అగ్నిప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ లేదా వైర్లలో సాంకేతిక లోపం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


More Telugu News