ఎట్టకేలకు పులి దొరికింది... కొత్తచెరువు వద్ద బంధించిన అటవీ అధికారులు!

  • ఆరు రోజులుగా భయపెడుతున్న పెద్ద పులికి చెక్
  • తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్
  • పగలు గోడ దూకి తప్పించుకున్నా.. సాయంత్రానికి బంధించిన బృందాలు
  • మత్తు ఇంజెక్షన్‌తో పులిని పట్టుకున్న అటవీ శాఖ అధికారులు
  • ఊపిరి పీల్చుకున్న మండపేట, పరిసర గ్రామాల ప్రజలు
తూర్పుగోదావరి జిల్లా ప్రజలను గత ఆరు రోజులుగా తీవ్ర భయాందోళనలకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ అధికారులు చేపట్టిన భారీ ఆపరేషన్ విజయవంతం కావడంతో మండపేట, రాయవరం, రాజానగరం మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ, మత్తు ఇంజెక్షన్ సహాయంతో పులిని సురక్షితంగా బంధించారు.

వివరాల్లోకి వెళితే, గత ఆరు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని రఘునాథపురం, జి.యర్రంపాలెం, కూర్మాపురం వంటి గ్రామాల్లో ఈ పులి సంచరిస్తూ సుమారు తొమ్మిది పశువులను, దూడలను చంపేసింది. దీంతో స్థానికులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. శుక్రవారం ఉదయం మండపేట నియోజకవర్గంలోని కూర్మాపురంలో ఒక పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపించడంతో గ్రామస్థులు అటవీ శాఖకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు.

పుణే, ఢిల్లీల నుంచి వచ్చిన నిపుణుల బృందాలు రంగంలోకి దిగి, పులిని మత్తు ఇంజెక్షన్‌తో బంధించేందుకు ప్రయత్నించాయి. అయితే, మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆపరేషన్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అధికారుల కళ్లుగప్పి పులి ఒక్కసారిగా గోడ దూకి, సమీపంలోని పంట పొలాల్లోకి పారిపోయింది. వేలాది మంది చూస్తుండగానే క్షణాల్లో అదృశ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది.

అయినప్పటికీ, పట్టువదలని అటవీ శాఖ బృందాలు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాల సహాయంతో దాని కదలికలను నిరంతరం గమనించాయి. చివరకు సాయంత్రం కొత్త చెరువు సమీపంలో పులిని గుర్తించి, చాకచక్యంగా మత్తు ఇంజెక్షన్ ప్రయోగించి బంధించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా గోదావరి నది దాటి ఇక్కడికి వచ్చిన ఈ మగ పులిని ఇప్పుడు దాని సహజ ఆవాసానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


More Telugu News