వైసీపీ హిందూ ద్రోహి: నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ పార్టీ హిందూ ద్రోహి అంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ధ్వంసం ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఘటన, తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి... వేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని విమర్శించారు. ఏ మాఫియాను కాపాడటానికి ఇదంతా చేశావు జగన్? అని ప్రశ్నించారు. హిందువులపై కుతంత్రాలు చేయడం తప్ప వైసీపీ నేతలకు మరొకటి లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నాగబాబు మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువుగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. వైసీపీ నేతలకు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న ఆసక్తి... హిందూ దేవాలయాలపై లేదని విమర్శించారు. సినిమా రివ్యూలపై ఉన్న శ్రద్ధ... భగవంతుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. 

తిరుమల డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే అవమానకరంగా మాట్లాడారని నాగబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ భార్య, కూతురు తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారని... అబ్దుల్ కలాం కంటే కూడా నీవు గొప్ప వ్యక్తివా? అని జగన్ పై మండిపడ్డారు. తిరుమల కొండతో పాటు ఇతర కొండలకు గుండు కొట్టాలని చూసింది నీవు కాదా? అని ప్రశ్నించారు.


More Telugu News