ఇంతకు మించిన ఆధారాలు ఇంకేముంటాయి స్పీకర్ గారు?: కవిత

  • జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో స్పీకర్ తీరుపై కవిత ఆగ్రహం
  • ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని విమర్శ
  • గాంధీ భవన్‌లో కాంగ్రెస్ మీటింగ్‌లో పాల్గొనడం పార్టీ మారినట్టు కాదా అని ప్రశ్న
  • స్పీకర్ తన పదవిలో ఉండి కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • రాజ్యాంగాన్ని, చట్టసభల ఔన్నత్యాన్ని ఎలా కాపాడతారని స్పీకర్‌ను నిలదీత
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆమె వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే, గాంధీ భవన్‌కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొంటే అది పార్టీ ఫిరాయించినట్టు కాదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

ఇంతకంటే బలమైన ఆధారాలు ఇంకేం కావాలని కవిత స్పీకర్‌ను నిలదీశారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ బీ-ఫారాలను సదరు ఎమ్మెల్యేనే పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందేనని, ఆ విషయం స్పీకర్ దృష్టికి రాలేదా? అని ఆమె అన్నారు. ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

"రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానంలో ఉండి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని అనుకోవాలా? అదే నిజమైతే భారత రాజ్యాంగాన్ని, చట్టసభల ఔన్నత్యాన్ని మీరు ఎలా కాపాడగలుగుతారు?" అంటూ కవిత స్పీకర్ తీరును తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.


More Telugu News

Kavitha Kalvakuntla Kavitha Telangana Assembly Speaker Gaddam Prasad Kumar Jagityala MLA Sanjay Kumar BRS Party Party Defection Telangana Politics Congress Party Municipal Elections