మీ తప్పులు మాపై నెట్టొద్దు: పాకిస్థాన్‌కు భారత్ ఘాటు కౌంటర్!

  • బలూచిస్థాన్ దాడులపై పాక్ ఆరోపణలు
  • భారత్ ప్రమేయం లేదన్న విదేశాంగ శాఖ
  • సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ఎత్తుగడ అంటూ ఫైర్
  • మానవ హక్కుల ఉల్లంఘనపై చురకలు
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరుగుతున్న రక్తపాతానికి భారతే కారణమంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు కేవలం నిరాధారమైనవే కాకుండా, పాక్ తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న పాత నాటకమని ఎద్దేవా చేసింది.

శనివారం బలూచిస్థాన్‌లోని 14 నగరాల్లో 'బలూచ్ లిబరేషన్ ఆర్మీ' (బీఎల్ఏ) ఏకకాలంలో దాడులకు తెగబడింది. ఈ హింసాకాండలో సుమారు 33 మంది సామాన్య పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతిగా పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో 130 మందికి పైగా తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ఈ దాడుల వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు.

పాక్ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. "ప్రతిసారి ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇతరులపై నిందలు వేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. ఆరోపణలు మానేసి, బలూచిస్థాన్ ప్రజల చిరకాల డిమాండ్లను పరిష్కరించడంపై పాక్ దృష్టి పెడితే మంచిది" అని హితవు పలికారు. అక్కడ జరుగుతున్న అణిచివేత, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన ఘాటుగా విమర్శించారు.

మరోవైపు, టీ20 వరల్డ్ కప్ వేదికల విషయంలో భారత్-పాక్ మధ్య నడుస్తున్న వివాదంపై సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంక స్పందించింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించడంపై తాము జోక్యం చేసుకోబోమని, భారత్, పాక్, బంగ్లాదేశ్ మూడు తమకు మిత్ర దేశాలేనని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌కు అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది.


More Telugu News