ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం, హైదరాబాద్ సహా ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లు

  • సహజ వనరులన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
  • మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయింపు
  • హైదరాబాద్ సహా వివిధ నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లు
రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఖనిజాల వెలికితీతకు ప్రత్యేక పథకం తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. తీర ప్రాంత రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని అన్నారు. సహజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆమె లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ఫార్మా, విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యా సంస్థల స్థాపనకు నిర్ణయించినట్లు తెలిపారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో కొత్తగా మూడు రసాయన పార్కుల స్థాపన, ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

జౌళి రంగ విస్తరణ, ఆధునికీకరణ, ఉపాధి దిశగా మరిన్ని అడుగులు వేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మన జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ, మెగా టెక్స్‌టైల్స్ పార్కులు, పరిశ్రమలకు విద్యా సంస్థల అనుసంధానం వంటి వాటిని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లు

ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 1. పుణే-హైదరాబాద్, 2. హైదరాబాద్-బెంగళూరు, 3. హైదరాబాద్-చెన్నై, 4. ముంబై-పుణే, 5. బెంగళూరు-చెన్నై, 6. ఢిల్లీ-వారణాసి, 7. వారణాసి-సిలిగురి కారిడార్లను ప్రకటించారు. వారణాసి, పాట్నాలలో షిప్ రిపేర్ కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు.

వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టెక్స్‌టైల్ రంగం కోసం 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని, ఈ రంగం కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సూక్ష్మతరహా పరిశ్రమల కోసం రూ.2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మూడు ఆయుర్వేద ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులను తీసుకు రానున్నట్లు తెలిపారు.


More Telugu News