Tamir Poleg: భర్తను వదిలేయడానికి ఓ మహిళకు 3 మిలియన్ డాలర్లను ఆఫర్ చేసిన రియల్ ఎస్టేట్ కింగ్
- అమెరికా రియల్ ఎస్టేట్ మొఘల్ పోలెగ్ పై లా సూట్ దాఖలు
- తన వద్ద పని చేస్తున్న మహిళకు క్యాష్, డీల్స్, ట్రిప్స్ ఆఫర్ చేసినట్టు సూట్ దాఖలు
- 5 మిలియన్ల నష్ట పరిహారం కోరుతున్న ఆమె భర్త
అమెరికాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత తమిర్ పోలెగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన తన వద్ద పనిచేస్తున్న మహిళను ఆమె భర్త నుంచి దూరం చేయడానికి 3 మిలియన్లకు పైగా డాలర్లను ఆఫర్ చేసినట్లు భారీ లా సూట్ దాఖలైంది. బాధిత మహిళ పైజ్ స్టెక్లింగ్ భర్త మైఖేల్ స్టెక్లింగ్ ఈ కేసు దాఖలు చేశాడు. డైలీ మెయిల్ ప్రకారం, పోలెగ్ భారీ క్యాష్, రియల్ ఎస్టేట్ డీల్స్, లగ్జరీ ట్రిప్స్ ఆఫర్ చేసి మైఖేల్ భార్యను ఆకర్షించాలని ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి.
కేసు వివరాల్లోకి వెళితే, జనవరి 2025లో పోలెగ్... పైజ్‌కు యూటాలోని పార్క్ సిటీలో 1.5 మిలియన్ డాలర్ల విలువైన ఇల్లు ఆఫర్ చేసి, భర్తను వదిలితే ఆమె అవసరాలన్నీ తీరుస్తానని చెప్పాడట. అదే సమయంలో పోలెగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. మరోవైపు, పైజ్ ఫిబ్రవరి 2025లో డైవోర్స్ దాఖలు చేసింది.
లా సూట్‌లో మరో ఆరోపణ ఏమిటంటే... పోలెగ్ తన కంపెనీ స్టాక్‌లో 6 లక్షల డాలర్ల విలువైనవి అమ్మి ఆ డబ్బును ఈ ప్రపోజల్ కోసం వాడాడట. ఫిబ్రవరి ప్రారంభంలో పైజ్‌కు 1.5 మిలియన్ల డాలర్లను రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో ఎలా తీసుకోవాలో ఈమెయిల్ చేశాడని కేసులో పేర్కొన్నారు. అదే సమయంలో మయామిలో హోటల్ రూమ్ బుక్ చేశాడట.
పోలెగ్ డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ... పైజ్ కు ఈమెయిల్ పంపినట్లు అంగీకరించాడు. కానీ, అది పైజ్ అడిగిన ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమేనని చెప్పాడు. “ఎలాంటి ఆఫర్లు లేవు, రొమాన్స్ లేదు, జోక్యం లేదు” అని ఆయన తెలిపాడు. పైజ్ తన వివాహంలో సమస్యలు ఎదుర్కొంటోందని తరచూ చెప్పేదని... కానీ, తమ మధ్య “లవ్ లేదా అఫెక్షన్” లేదని ఆయన అన్నాడు.
పైజ్ స్టెక్లింగ్ డైలీ మెయిల్‌కు స్టేట్‌మెంట్ ఇస్తూ, “నా వివాహం వ్యక్తిగత కారణాల వల్ల ముగిసింది. ఈ లా సూట్‌లోని ఆరోపణలు నిజాలను ప్రతిబింబించడం లేదు” అని చెప్పింది. మరోవైపు, లా సూట్ ప్రకారం మైఖేల్ 5 మిలియన్ల నష్ట పరిహారం కోరుతున్నాడు.