Anil Ravipudi: తిరుమలలో డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నెక్స్ట్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

Anil Ravipudi visits Tirumala gives next movie update
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి
  • 'మన శంకర వరప్రసాద్ గారు' విజయానికి కృతజ్ఞతగా మొక్కులు
  • 15 రోజుల్లో తర్వాతి సినిమాపై అధికారిక ప్రకటన ఇస్తానని వెల్లడి
  • ఈసారి కొత్త జానర్ సినిమాతో రానున్నట్టు సంకేతాలు
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలై రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా భారీ విజయానికి కృతజ్ఞతగా ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి, తన తదుపరి ప్రాజెక్ట్‌పై కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, మరో 10 నుంచి 15 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆయన తర్వాతి చిత్రం ఎవరితో ఉండనుందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రాన్ని విక్టరీ వెంకటేశ్‌తో చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది భారీ మల్టీస్టారర్‌గా ఉండనుందని, ఇందులో తమిళ నటుడు కార్తీ లేదా మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వినోదాత్మక చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన, ఈసారి పూర్తి భిన్నమైన జానర్‌లో సినిమా తీసేందుకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Anil Ravipudi
Chiranjeevi
Manashankara Varaprasad Garu
Venkatesh
Karthi
Fahadh Faasil
Tollywood
Tirumala
Telugu cinema
Director

More Telugu News