Pat Cummins: టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌... స్టార్ పేసర్ ఔట్!

Australia T20 World Cup Team Announced Cummins Ruled Out
  • గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన ప్యాట్ కమిన్స్
  • తుది జట్టులో కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌కు చోటు
  • గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వ‌చ్చిన జోష్ హేజిల్‌వుడ్ 
  • మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఆస్ట్రేలియా
ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ పేస్ బౌలర్, కీలక ఆటగాడు ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా మెగా టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. ఈ మేరకు ప్రావిజనల్ జట్టులో రెండు మార్పులు చేసి, 15 మందితో కూడిన తుది జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ ప్రకటించింది.

గతేడాది జూలైలో వెన్ను గాయానికి గురైన కమిన్స్, ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడిని టోర్నీ నుంచి తప్పించాలని సీఏ నిర్ణయించింది. కమిన్స్ స్థానంలో మరో పేసర్ బెన్ డ్వార్షుయిస్‌ను జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ మ్యాథ్యూ షార్ట్‌ను కూడా తుది జట్టు నుంచి తొలగించారు.

అయితే, గాయాల కారణంగా యాషెస్ సిరీస్‌కు దూరమైన మరో ప్రధాన పేసర్ జోష్ హాజిల్‌వుడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావడం ఆసీస్‌కు ఊరటనిచ్చే అంశం. పాకిస్థాన్ పర్యటనకు దూరమైన టిమ్ డేవిడ్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు.

హేజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్‌లతో పేస్ విభాగం బలంగానే ఉంది. శ్రీలంక, భారత్‌లో జరగనున్న ఈ టోర్నీలో స్పిన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఆడమ్ జంపా, మాథ్యూ కునెమన్‌లను జట్టులో చేర్చారు. ఆస్ట్రేలియా గ్రూప్-బీలో ఉండగా, ఫిబ్రవరి 11న కొలంబోలో ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 
Pat Cummins
Australia T20 World Cup
T20 World Cup 2026
Josh Hazlewood
Ben Dwarshuis
Mitchell Marsh
Nathan Ellis
Matthew Short
Cricket Australia
Australia Cricket Team

More Telugu News