U19 World Cup 2026: సెమీస్ బెర్త్ కోసం దాయాదుల మహా సమరం.. పాక్‌కు గెలిస్తే సరిపోదు!

India Pakistan U19 Semifinal Berth Crucial Match
  • అండ‌ర్‌-19 ప్రపంచకప్ సెమీస్ బెర్త్ కోసం భారత్-పాకిస్థాన్ కీలక పోరు
  • రేపు బులవాయో వేదికగా దాయాదుల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్
  • పాక్‌పై గెలిస్తే గ్రూప్ టాపర్‌గా సెమీస్‌కు దూసుకెళ్లనున్న భారత్
  • అర్హత సాధించాలంటే పాకిస్థాన్ భారీ తేడాతో విజయం సాధించడం తప్పనిసరి
  • ఇప్పటికే సెమీస్‌కు చేరిన ఆస్ట్రేలియా, ఆఫ్ఘ‌నిస్థాన్‌, ఇంగ్లండ్
అండర్-19 ప్రపంచకప్ 2026 టోర్నీలో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. ఆఖరి సెమీ ఫైనల్ బెర్త్ కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. బులవాయో వేదికగా ఆదివారం జరిగే ఈ సూపర్ సిక్స్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘ‌నిస్థాన్, ఇంగ్లండ్ జట్లు నాకౌట్ దశకు చేరుకోగా, మిగిలిన ఒక్క స్థానం కోసం ఈ రెండు దాయాది దేశాలు పోటీ పడుతున్నాయి.

ప్రస్తుతం గ్రూప్-2 పాయింట్ల పట్టికలో ఆయుష్ మాత్రే నేతృత్వంలోని భారత జట్టు రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో గెలిచి, 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో రేపు జరిగే భారత్-పాక్ మ్యాచ్ వర్చువల్ నాకౌట్‌గా మారింది.

సెమీస్ సమీకరణాలు ఇలా...
భారత జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ కంటే రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. దీనికి తోడు +3.337 నెట్ రన్‌రేట్ భారత్‌కు పెద్ద సానుకూలాంశం. పాకిస్థాన్‌పై విజయం సాధిస్తే, భారత జట్టు గ్రూప్-2 టాపర్‌గా నిలిచి సెమీ ఫైనల్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో తలపడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా, మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్‌కు సెమీస్ చేరే అవకాశాలు సజీవంగానే ఉంటాయి.

మరోవైపు పాకిస్థాన్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. సెమీస్‌కు అర్హత సాధించాలంటే భారత్‌పై కేవలం గెలిస్తే సరిపోదు. భారీ తేడాతో విజయం సాధించడం తప్పనిసరి. మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 85 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే, నిర్దేశిత లక్ష్యాన్ని 31.5 ఓవర్లలోపే (లక్ష్యం 250 అయితే 33.2 ఓవర్లలోపు) ఛేదించాల్సి ఉంటుంది. ఈ సమీకరణాలను అందుకుంటేనే పాక్‌కు సెమీస్ ఆశలు ఉంటాయి.

గ్రూప్ దశలో తమతో పాటు అర్హత సాధించిన మరో జట్టుపై గెలిచిన పాయింట్లను మాత్రమే సూపర్ సిక్స్ దశకు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నిబంధన కారణంగానే భారత్, ఇంగ్లండ్ కంటే పాకిస్థాన్ రెండు పాయింట్లు వెనుకబడి సూపర్ సిక్స్‌ను ప్రారంభించింది. ఇక, ఈ మ్యాచ్ ఫలితం ఇంగ్లండ్ సెమీస్ ప్రత్యర్థిని కూడా నిర్దేశిస్తుంది. భారత్ గెలిస్తే ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో, పాక్ గెలిస్తే ఇంగ్లండ్.. ఆఫ్ఘ‌నిస్థాన్‌తో సెమీస్‌లో ఆడుతుంది.

కాగా, గ‌తేడాది ఆఖ‌ర్లో జ‌రిగిన అండర్-19 ఆసియా కప్ టోర్నీ ఫైన‌ల్లో భార‌త్‌, పాకిస్థాన్‌ పోటీప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో భార‌త్‌ను ఓడించి పాక్ జట్టు ట్రోఫీని ఎగిరేసుకుపోయింది. రేప‌టి మ్యాచ్‌లో దాయాది దేశాన్ని మ‌ట్టిక‌రిపించ‌డం ద్వారా ఇప్పుడు భారత్‌కు ఆ ఘోర ప‌రాభ‌వానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. 
U19 World Cup 2026
India Pakistan U19
India U19
Pakistan U19
Ayush Matre
U19 Semifinals
India vs Pakistan
Cricket
ICC U19 World Cup

More Telugu News