Medaram Jatara: మేడారంలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్.. గంటల తరబడి నిరీక్షణ

Heavy Traffic Congestion Between Pasra To Tadvai Due To Medaram Jatara
  • మేడారం జాతరలో భారీగా ట్రాఫిక్ జామ్
  • గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు
  • అమ్మవార్ల దర్శనానికి భక్తుల తీవ్ర అవస్థలు
  • ప్రభుత్వ ఏర్పాట్లపై వెల్లువెత్తిన విమర్శలు
  • నేటితో ముగియనున్న మహా జాతర
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. అయితే, ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా భారీ ట్రాఫిక్ జామ్‌తో నరకయాతన అనుభవిస్తున్నారు.

దర్శనం ముగించుకుని తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో మేడారం మార్గాలు నిండిపోయాయి. తాడ్వాయి – మేడారం మార్గంలో ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలతో పాటు ప్రైవేట్‌ వాహనాలు భారీగా చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గోవిందరావుపేట మండలం పస్రా వద్ద కూడా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ప్రైవేట్‌ వాహనాలను పస్రా మీదుగా, ఆర్టీసీ, వీఐపీ వాహనాలను తాడ్వాయి మీదుగా మళ్లించారు.

మరోవైపు అమ్మవార్ల గద్దెల వద్ద కూడా సరైన ఏర్పాట్లు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ పాస్‌లు ఉన్నవారికి సైతం శుక్రవారం క్యూలైన్లను ఎత్తివేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో పాస్‌లు చేతిలో ఉన్నా దర్శనం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన రద్దీ, గంటల తరబడి నిరీక్షణతో విసిగిపోయిన కొందరు భక్తులు, అమ్మవార్లను దూరం నుంచే దణ్ణం పెట్టుకుని వెనుదిరిగారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. కాగా, శనివారం అమ్మవార్ల వన ప్రవేశంతో మహా జాతర ముగియనుంది.
Medaram Jatara
Sammakka Saralamma Jatara
Telangana Kumbh Mela
Traffic Jam
Devotees Problems
VIP Passes
Pasra
Tadvai
Govindraopet

More Telugu News