Ambati Rambabu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?: అంబటి రాంబాబు

Ambati Rambabu Slams Chandrababu Pawan Kalyan Over Laddu Issue
  • తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారన్న అంబటి
  • సిట్ నివేదిక వచ్చిన తర్వాత నోరు మెదపడం లేదని వ్యాఖ్య
  • చంద్రబాబుకు పవన్ చెంచాలా మారిపోయారని ఎద్దేవా
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక వచ్చిన తర్వాత వీరిద్దరూ నోరు మెదపడం లేదని అన్నారు. ఇంతవరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన దుర్మార్గులు చంద్రబాబు, పవన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించారని అన్నారు. 

చంద్రబాబుకు పవన్ చెంచాగా మారిపోయారని, తనకు ఒక సొంత పార్టీ ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయారని అంబటి ఎద్దేవా చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతువుల కొవ్వు ఉందని పవన్ తప్పుడు ప్రచారం చేశారని, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. 

నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ తీసిన ట్యాంకర్లు కూటమి ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని అంబటి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల తర్వాత వచ్చిన ట్యాంకర్ల నుంచే శాంపిల్స్ తీసినట్టు నివేదికలు వచ్చాయని తెలిపారు. ఆ శాంపిల్స్ లో జంతువుల కొవ్వు కలవలేదని నివేదికల్లో ఉన్నా... వైసీపీపై బురద చల్లేందుకు యత్నించారని మండిపడ్డారు. బోలేబాబా ఎంటర్ అయింది కూడా చంద్రబాబు హయాంలోనే అని అన్నారు. 

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పు చేసి ఉంటే... ఆయన పేరు చార్జ్ షీట్ లో ఎందుకు లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో కూర్చొని అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఇష్టానుసారం వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంలో అసలు నిజాలు ప్రజలకు తెలిసిపోయాయని చెప్పారు.
Ambati Rambabu
Chandrababu Naidu
Pawan Kalyan
Tirumala laddu
TTD
YV Subba Reddy
Andhra Pradesh Politics
Laddu controversy
Tirupati
BR Naidu

More Telugu News