Shehbaz Sharif: మిత్ర దేశాల వద్ద తల వంచి అప్పు అడుక్కొచ్చాం.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదిగో!

Pakistan PM Shehbaz Sharif on Borrowing from Friendly Nations
  • అప్పు ఇచ్చే వారు ఎన్నో షరతులు పెడతారని వెల్లడి
  • ఐఎంఎఫ్ లోన్ గ్యాప్ పూడ్చుకునేందుకు తప్పలేదని వివరణ
  • ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించిన షెహబాజ్ షరీఫ్
దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి, ఇటు మిత్ర దేశాల నుంచి అప్పు తీసుకోవడం తప్పనిసరిగా మారిందని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఓ సమావేశంలో కిక్కిరిసిన జనం ముందు ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఐఎంఎఫ్ లోన్ల గ్యాప్ పూడ్చుకోవడానికి తాను, ఫీల్డ్ మార్షల్ (ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) ఆసిమ్ మునీర్ కలిసి అప్పు కోసం మిత్ర దేశాలను ఆశ్రయించామని వివరించారు. తామిద్దరం తల వంచుకుని అప్పు అడిగేందుకు వెళ్లామని తెలిపారు.

మిత్ర దేశాలపై తమ ఆశలు ఎన్నడూ వమ్ముకాలేదని వివరించారు. అయితే, అప్పు అడిగేందుకు వెళ్లే వారి తల వంగి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందేనని షరీఫ్ గుర్తుచేశారు. అదేవిధంగా, అప్పు ఇచ్చేందుకు ఎన్నో షరతులు పెడతారని, తీసుకునే వారు విధిలేక వాటికి అంగీకరించాల్సి వస్తుందని షరీప్ వివరించారు. అయితే, మిత్ర దేశాలు ఏమేం షరతులు విధించాయనే వివరాలను షరీఫ్ వెల్లడించలేదు. తాము అడిగిన మొత్తాన్ని అప్పుగా అందజేశాయని మాత్రమే తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shehbaz Sharif
Pakistan
Pakistan Economy
IMF Loan
Debt
International Monetary Fund
Asim Munir
Pakistan Prime Minister
Financial Crisis
Loans

More Telugu News