Nirmala Sitharaman: 'ఉచితాల'తో ఖజానాకు గండం: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై 'ఆర్థిక సర్వే' హెచ్చరిక!

State finances threatened by free schemes says Economic Survey
  • రాష్ట్రాలను హెచ్చరించిన ఆర్థిక సర్వే
  • ఉచితాల కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందని హెచ్చరిక
  • నగదు బదిలీ పథకాల ఖర్చు మూడేళ్లలో ఐదు రెట్లు పెరిగిందన్న సర్వే
  • రాష్ట్రాల ఆదాయంలో 62 శాతం జీతాలు, పెన్షన్లు, వడ్డీలకే సరిపోతోందని ఆవేదన
  • బ్రెజిల్ మోడల్ అనుసరించాలని సూచన
ఓట్ల వేటలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ఉచిత పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ‘ఆర్థిక సర్వే 2025-26’ తీవ్రంగా హెచ్చరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం నిబంధనలు లేని నగదు బదిలీ పథకాల కోసం రాష్ట్రాలు చేస్తున్న ఖర్చు గత మూడేళ్లలో ఐదు రెట్లు పెరిగి, ఈ ఏడాది రూ. 1.7 లక్షల కోట్లకు చేరుకుంది.

ఈ భారీ వ్యయం వల్ల రాష్ట్రాల ఆదాయంలో దాదాపు 62 శాతం కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఉచితాలకే సరిపోతోంది. ఫలితంగా.. రోడ్లు, రైల్వేలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సిన 'మూలధన వ్యయం' దారుణంగా తగ్గిపోతోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అప్పులు చేసి మరీ వినియోగం కోసం ఖర్చు చేయడం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉందని, కేవలం నగదును చేతిలో పెట్టడం వల్ల పేదరికం తగ్గడం లేదని నివేదిక స్పష్టం చేసింది.

ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు బ్రెజిల్‌లో విజయవంతమైన 'బోల్సా ఫ్యామిలియా' తరహా విధానాన్ని అనుసరించాలని ఆర్థిక సర్వే సూచించింది. కేవలం ఉచితంగా డబ్బులు ఇవ్వకుండా, దానికి కొన్ని నిబంధనలను జోడించాలని పేర్కొంది. ఉదాహరణకు.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందే కుటుంబాలు తమ పిల్లలను ఖచ్చితంగా బడికి పంపడం, సకాలంలో టీకాలు వేయించడం వంటి సామాజిక బాధ్యతలను నెరవేర్చాలి. 

అంతేకాకుండా, ప్రతి పథకానికి ఒక 'సన్‌సెట్ క్లాజ్' (ముగింపు గడువు) ఉండాలని, ప్రజలు ఎప్పటికీ ప్రభుత్వంపైనే ఆధారపడకుండా వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేలా పథకాల రూపకల్పన ఉండాలని సర్వే ప్రతిపాదించింది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడి మరీ ఇస్తున్న నగదు బదిలీలు, వారు తిరిగి ఉపాధి రంగంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని, ఇది దేశ ఉత్పాదకతపై ప్రభావం చూపుతోందని నివేదిక పేర్కొంది. సంక్షేమం అనేది ఒక భద్రతా వలయంగా ఉండాలి తప్ప, అది అభివృద్ధికి ఆటంకం కాకూడదని ఆర్థిక సర్వే గట్టిగా నొక్కి చెప్పింది. 
Nirmala Sitharaman
state finances
economic survey
free schemes
fiscal deficit
indian economy
welfare schemes
capital expenditure
Bolsa Familia
financial crisis

More Telugu News