Hyderabad: కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు.. రూ.6 లక్షలు దోపిడీ

Hyderabad Koti Bank Street Shooting Incident
  • ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన‌ వ్యక్తిపై దాడి
  • కాల్పులు జరిపి రూ.6 లక్షల నగదు దోపిడీ
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్ లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో ఈరోజు ఉదయం కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడి, ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షల నగదును దోచుకెళ్లారు.

వివరాల్లోకి వెళితే... రషీద్ అనే వ్యక్తి ఉదయం 7 గంటల సమయంలో ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అప్పటికే అతడిని వెంబడిస్తున్న దుండగులు, ఏటీఎం వద్ద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ గాయం కాగా, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును లాక్కొని పరారయ్యారు.

సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన రషీద్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగర నడిబొడ్డున ఉదయాన్నే ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది.
Hyderabad
Koti Bank Street
Koti Bank Street Robbery
SBI Hyderabad
Firing incident
Sultan Bazar Police
Rashid
Cash Robbery

More Telugu News