Hyderabad-Vijayawada Highway: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీ ప్రమాదం .. 4 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

Hyderabad Vijayawada Highway Accident Causes Traffic Jam
  • యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఘటన
  • కంటైనర్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్
  • క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్
  • సుమారు అరగంట పాటు శ్రమించి డ్రైవర్‌ను క్షేమంగా బయటకు తీసిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ముందు క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. 

ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడడంతో ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 
 
డ్రైవర్‌ను బయటకు తీసేందుకు పోలీసులు సుమారు అరగంటకు పైగా శ్రమించారు. గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాల సహాయంతో క్యాబిన్ భాగాలను కట్ చేసి చివరకు డ్రైవర్‌ను క్షేమంగా బయటకు తీయగలిగారు. అనంతరం అతడిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. 

ఈ రోడ్డు ప్రమాదం కారణంగా విజయవాడ – హైదరాబాద్  జాతీయ రహదారిపై నాలుగు కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు.
Hyderabad-Vijayawada Highway
Choutuppal
Khaithapuram
Road Accident
Traffic Jam
Yadadri Bhuvanagiri
Oil Tanker Accident
Highway Accident
Telangana Traffic
Container Truck

More Telugu News