Supreme Court: నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

Supreme Court Declares Menstrual Health a Fundamental Right
  • జీవించే హక్కులో ఇది అంతర్భాగమని స్పష్టీకరణ
  • పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలని ఆదేశం
  • అన్ని స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు తప్పనిసరి అని సూచన
  • కేంద్రం విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని తీర్పు
నెలసరి ఆరోగ్యం అనేది మహిళల ప్రాథమిక హక్కు అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో ఇది అంతర్భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పాఠశాలల్లో నెలసరి పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం బాలికల విద్యాహక్కుకు, ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోందని స్పష్టం చేసింది.

జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదివే బాలికలకు ఉచితంగా బయోడీగ్రేడబుల్ శానిటరీ న్యాప్‌కిన్లు అందించాలని ఆదేశించింది. పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు, నీటి వసతి, సబ్బుతో చేతులు కడుక్కునే సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. దివ్యాంగ బాలికలు కూడా సులభంగా వినియోగించేలా టాయిలెట్లు నిర్మించాలని సూచించింది.

ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. "విద్యాహక్కు అనేది ఇతర హక్కులను సాకారం చేసే 'మల్టిప్లయర్ రైట్'. నెలసరి పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం వల్ల బాలికలు చదువుకు దూరమవుతున్నారు. గౌరవం అనేది ఓ ఆదర్శంగా మిగిలిపోకూడదు. అవమానం లేకుండా జీవించే పరిస్థితుల్లో అది కనిపించాలి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'పాఠశాల బాలికల కోసం నెలసరి పరిశుభ్రత విధానాన్ని' అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇకపై నెలసరి ఆరోగ్య సంరక్షణ అనేది చట్టబద్ధమైన హక్కుగా మారింది.
Supreme Court
Menstrual Health
Womens Rights
Article 21
Right to Education
Sanitary Napkins
School Hygiene
India
Supreme Court Judgement
Public Interest Litigation

More Telugu News