BITS Pilani: ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ... సీఆర్డీఏతో కీలక ఒప్పందం

BITS Pilani to Establish Campus in Amravati with AP CRDA Agreement
  • బిట్స్ పిలానీ ఏర్పాటుకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
  • మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమికి సంబంధించిన ఒప్పంద ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు
  • అమరావతి క్యాంపస్‌ను మూడు దశలుగా అభివృద్ధి చేయనున్నామన్న బిట్స్ పిలానీ ప్రతినిధులు
రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. ఈ మేరకు బిట్స్ పిలానీ ప్రతినిధులు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటైన బిట్స్ పిలానీ అమరావతిలో ఆధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. 

ఈ ప్రాజెక్టు కోసం తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 70 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమికి సంబంధించిన ఒప్పందం మందడం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారికంగా పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఆర్‌డీఏ ఎస్టేట్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ వి. డేవిడ్ రాజు, బిట్స్ పిలానీ అధీకృత ప్రతినిధి, డిప్యూటీ రిజిస్ట్రార్ వి.వి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొన్నారు. సబ్‌ రిజిస్ట్రార్ సి.హెచ్. రాంబాబు సమక్షంలో ఒప్పంద ప్రక్రియ జరిగింది. 

బిట్స్ అమరావతి క్యాంపస్‌ను మూడు దశలుగా అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తొలి దశలోనే సుమారు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. పనులు వేగంగా పూర్తి చేసి 2027 నుంచే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
 
BITS Pilani
Amravati
AP CRDA
Andhra Pradesh
Education
Engineering College
Tulluru
Mandadam
Venkata Palem

More Telugu News