రేవంత్ ను తెలంగాణ సమాజం క్షమించదు: హరీశ్ రావు

  • తెలంగాణ జలాలను ఏపీకి దోచిపెడుతున్నారని హరీశ్ మండిపాటు
  • కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి అని విమర్శ
  • చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని మండిపాటు
తెలంగాణ జలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రకు దోచిపెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంవాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని కాళోజీ ముందే చెప్పినట్టే... సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెడుతున్నారని అన్నారు. పక్కా పథకం ప్రకారం పోలవరం-నల్లమలసాగర్ కు ఏపీ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ సహకరిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో చెల్లని రిట్ పిటిషన్ వేసి, వాపస్ తెచ్చుకున్నారని విమర్శించారు. 

తొలి నుంచి కూడా గోదావరి నదీ జలాల అక్రమ తరలింపుపై బీఆర్ఎస్ అప్రమత్తం చేస్తూనే ఉందని... అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని హరీశ్ అన్నారు. ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నా... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పులు చేస్తూనే ఉందని దుయ్యబట్టారు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుదని, పొడిచేది రేవంత్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని విమర్శించారు. 

చంద్రబాబు కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న రేవంత్ ను తెలంగాణ సమాజం క్షమించదని హరీశ్ అన్నారు. రేవంత్ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, రాష్ట్ర నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తామని ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న దోపిడీపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేశారు. 


More Telugu News