Danam Nagender: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ విచారణ ప్రారంభం

Danam Nagender Disqualification Petition Hearing Begins
  • సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాదనలు వింటున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
  • కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేశారని బీఆర్ఎస్ ఆరోపణ
  • బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదంటున్న దానం నాగేందర్
  • ఇప్పటికే 7గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం విచారణ ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను రెండు వారాల్లో తేల్చాలని సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ విచారణలో భాగంగా, పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏ. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనలను స్పీకర్ విననున్నారు. అనంతరం వారు సమర్పించే సాక్ష్యాలను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత దానం నాగేందర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. 

అయితే, తనకు స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని దానం నాగేందర్ తెలిపారు. 2023లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్, 2024లో కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ నుంచి ఆ పార్టీ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేశారని బీఆర్ఎస్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు, తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, స్వచ్ఛందంగా పార్టీని వీడలేదని నాగేందర్ వాదిస్తున్నారు. 2024 మార్చిలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలోనే హాజరయ్యానని ఆయన తన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేవలం మీడియా కథనాల ఆధారంగా పిటిషన్లు వేశారని, వాటిని కొట్టివేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు.

ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఏడుగురిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వారు కాంగ్రెస్‌లో చేరినట్లు సరైన ఆధారాలు లేవని, సాంకేతికంగా వారంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని తన తీర్పులో పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో పెట్టారు.
Danam Nagender
BRS
Congress
Telangana Assembly Speaker
Disqualification Petition
Koushik Reddy
A Maheshwar Reddy
Party Defection
Telangana Politics
Speaker Gaddam Prasad Kumar

More Telugu News