Telangana High Court: సిగాచి బాధితులకు పరిహారం.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

High Court Expresses Anger Over Govts Approach to Sigachi Victims Compensation
  • సిగాచి ఫార్మా ప్రమాద బాధితుల పరిహారంపై హైకోర్టు అసహనం
  • ప్రభుత్వం తీరుపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం
  • పరిహారం ఎప్పుడు, ఎంత ఇస్తారో చెప్పాలంటూ ప్రశ్నలు
  • కంపెనీతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ డైరెక్టర్లకు నోటీసులు
సంగారెడ్డి జిల్లా సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరిహారం పంపిణీలో జాప్యం, స్పష్టత లేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

గతేడాది సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో 56 మంది దుర్మరణం చెందగా, 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాధితులకు పరిహారం అందించాలని, ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అపరేశ్‌ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. "పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు? ఎంత ఇస్తున్నారు? అసలు ఎప్పుడు ఇస్తారు?" అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

పరిహారం పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కంపెనీని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసులో ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలిని సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు చట్టప్రకారం అందాల్సిన ప్రయోజనాల వివరాలను సమర్పించాలని వారికి నోటీసులు జారీ చేసింది.
Telangana High Court
Sigachi Pharma
Sigachi Pharma accident
Sangareddy
Pasamylaram
Compensation
Victims
Telangana Government
Industrial accident

More Telugu News