Mumbai Taxi Driver: 400 మీటర్ల ప్రయాణానికి రూ.18,000 బిల్లు.. సోషల్ మీడియా పోస్టుతో చిక్కిన ట్యాక్సీ డ్రైవర్

Mumbai taxi driver arrested for cheating American woman by charging Rs 18000 for 400 metre ride
  • అమెరికన్ మహిళ నుంచి 18 వేలు వసూలు చేసిన ముంబై ట్యాక్సీ డ్రైవర్
  • 400 మీటర్ల దూరానికే అధిక ఛార్జీలు.. సోషల్ మీడియాలో బాధితురాలి పోస్ట్
  • రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్ 
  • ఈ మోసంలో మరో వ్యక్తి ప్రమేయం.. పరారీలో ఉన్నట్లు గుర్తింపు
ముంబై విమానాశ్రయంలో ఓ అమెరికన్ మహిళను మోసం చేసిన ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న హోటల్‌కు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.18,000 వసూలు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకోవడంతో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అర్జెంటీనా అరియానో అనే అమెరికన్ మహిళ ఈ నెల‌ 12న ముంబైకి వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి దగ్గర్లోని హోటల్‌కు వెళ్లేందుకు దేశ్‌రాజ్ యాదవ్ (50) అనే డ్రైవర్ ట్యాక్సీని ఆశ్రయించారు. అయితే, నిందితుడు ఆమెను నేరుగా హోటల్‌కు తీసుకెళ్లకుండా, అంధేరి ప్రాంతంలో సుమారు 20 నిమిషాల పాటు అనవసరంగా తిప్పాడు. సుదీర్ఘ ప్రయాణం చేసినట్లు నమ్మించి, అర కిలోమీటర్ కూడా లేని దూరానికి రూ.18,000 డిమాండ్ చేసి తీసుకున్నాడు.

ఈ మోసం గురించి ఈ నెల‌ 26న అరియానో 'ఎక్స్‌' (గతంలో ట్విట్టర్)లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ, ట్యాక్సీ నంబర్‌తో సహా వివరాలను పంచుకున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సహార్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ట్యాక్సీ నంబర్ ఆధారంగా నిందితుడు దేశ్‌రాజ్‌ను మూడు గంటల్లోనే అరెస్ట్ చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఈ నేరంలో యాదవ్‌తో పాటు తౌఫిక్ షేక్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ముంబై విమానాశ్రయంలో పర్యాటకులను మోసం చేసే ఘటనలు గతంలోనూ జరిగాయి. గత డిసెంబర్‌లో ఆస్ట్రేలియన్ ఎన్నారై, అమెరికాకు చెందిన విద్యార్థి వద్ద అధిక ఛార్జీలు వసూలు చేసిన డ్రైవర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యాటకులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Mumbai Taxi Driver
taxi driver fraud
Mumbai Airport
American tourist
overcharging
Andheri
Taufiq Sheikh
Sahar police
social media post
tourist exploitation
Deshraj Yadav

More Telugu News