మేడారం జనసంద్రం.. పోటెత్తిన భక్తజనం

  • గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ
  • వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తజనం
  • నేడు మేడారం వెళ్లనున్న తెలంగాణ గవర్నర్
  • కరెంట్ కోతలతో ఉద్రిక్తత.. మంత్రి కారు ధ్వంసం
  • వీఐపీలకే ప్రాధాన్యమంటూ పోలీసులపై విమర్శలు
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. దీంతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. భారీగా తరలివచ్చిన భక్తులను నియంత్రించడం అధికారులకు సవాలుగా మారింది. మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం సందర్శించి, వన దేవతలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క గద్దెలపైకి చేరడంతో గురువారం అర్ధరాత్రి నుంచే భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభించారు. అయితే, గురువారం రాత్రి జాతర ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన కొందరు భక్తులు, అక్కడే ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు అద్దాలను, సమీపంలోని దుకాణాలను ధ్వంసం చేశారు.

ఈ నెల 28న ప్రారంభమైన ఈ జాతర 31న ముగియనుంది. జాతరకు వీఐపీలు, వీవీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 25 మంది ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే, పోలీసులు వీవీఐపీలు, వారి కుటుంబాల సేవకే పరిమితమై సామాన్య భక్తుల రద్దీని నియంత్రించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్ వన దేవతలను దర్శించుకున్నారు.


More Telugu News