: ప్రియుడితో పరారైన భార్య.. మనస్తాపంతో భర్త, మధ్యవర్తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

  • పెళ్లయిన రెండు నెలలకే ప్రియుడితో వెళ్లిపోయిన భార్య
  • భార్య మోసం భరించలేక ఆత్మహత్య చేసుకున్న భర్త
  • భర్త మరణవార్త విని పెళ్లి సంబంధం చూసిన మధ్యవర్తి కూడా ఆత్మహత్య
  • ఆత్మహత్యకు ప్రేరేపించిందన్న ఆరోపణలపై భార్య అరెస్ట్
  • కర్ణాటకలోని దావణగెరెలో దారుణ ఘటన
కర్ణాటకలోని దావణగెరెలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన రెండు నెలలకే తన భార్య ప్రియుడితో వెళ్లిపోవడంతో.. మనస్తాపానికి గురైన భర్త, అతనికి పెళ్లి సంబంధం చూసిన బంధువు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. సరస్వతి అనే యువతికి హరీశ్‌తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ నెల‌ 23న గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరస్వతి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. సరస్వతి తన ప్రియుడు శివకుమార్‌తో వెళ్లిపోయినట్లు తేలింది.

ఈ విషయం తెలుసుకున్న భర్త హరీశ్ (30) తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణమైన వారి పేర్లను డెత్ నోట్‌లో పేర్కొన్నాడు. హరీశ్ మరణవార్తను తట్టుకోలేక, వారికి పెళ్లి సంబంధం కుదిర్చిన రుద్రేశ్ (36) కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రుద్రేశ్ .. సరస్వతికి వ‌ర‌సకు మామ కావడం గమనార్హం.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం వివాహానికి ముందే సరస్వతికి ప్రేమ వ్యవహారం ఉందని, ఈ విషయం తెలిసి కూడా హరీశ్ ఆమె కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడని తెలిసింది.

ఈ ఘటనపై దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ మాట్లాడుతూ.. "దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రెండు కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇరు పక్షాల నుంచి ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు ప్రారంభించాం" అని తెలిపారు. భర్త ఆత్మహత్యకు ప్రేరేపించిందన్న ఆరోపణలపై పోలీసులు సరస్వతిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

More Telugu News