Mojtaba Khamenei: ఖమేనీ కుమారుడి రహస్య సామ్రాజ్యం: లండన్ 'బిలియనీర్ రో'లో విల్లాలు.. హోటళ్లు!

Mojtaba Khamenei Secret Empire Khamenei Sons Villas in London Billionaire Row
  • లండన్, దుబాయ్, యూరప్‌లో రూ. వెయ్యి కోట్లకు పైగా విలువైన ఆస్తులు
  • బ్లూమ్‌బెర్గ్ దర్యాప్తులో వెల్లడి
  • ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా వచ్చిన నిధులు
  • షెల్ కంపెనీల ద్వారా విదేశీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తింపు
  • ఆస్తులన్నీ అలీ అన్సారీ అనే వ్యాపారవేత్త పేరిట ఉన్న వైనం
  • అసలు సూత్రధారి మోజ్తబా ఖమేనీ అని ఇంటెలిజెన్స్ నివేదికల సారాంశం
ప్రపంచానికి త్యాగం, నిరాడంబరత గురించి బోధించే ఇరాన్ పాలకుల అసలు రంగు బయటపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ (56) విదేశాల్లో వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ ఏడాది పాటు జరిపిన పరిశోధనలో తేలింది. లండన్‌లోని అత్యంత ఖరీదైన 'బిలియనీర్స్ రో' (The Bishops Avenue) నుంచి జర్మనీలోని ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు ఆయన సామ్రాజ్యం విస్తరించింది.

అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, మోజ్తబా ఈ ఆస్తులను అత్యంత రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడా తన పేరు నేరుగా కనిపించకుండా, షెల్ కంపెనీలు, బినామీల ద్వారా ఈ నెట్‌వర్క్ నడుస్తోంది. బ్రిటన్ గతేడాది ఆంక్షలు విధించిన ఇరాన్ బ్యాంకర్ అలీ అన్సారీ, ఈ ఆస్తుల వెనుక ఉన్న ప్రధాన వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

కేవలం ఒక్క భవనం కోసమే 2014లో సుమారు రూ. 300 కోట్లు వెచ్చించినట్లు ఆధారాలు దొరికాయి. అలాగే, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్, స్పెయిన్‌లోని మల్లోర్కాలో లగ్జరీ హోటళ్లు ఈ నెట్‌వర్క్ పరిధిలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్, యూఏఈ, బ్రిటన్ బ్యాంకులను వాడుకుని ఇరాన్ చమురు సొమ్మును విదేశాలకు చేరవేసినట్లు నివేదిక పేర్కొంది.

ఇరాన్‌లో సామాన్యులు తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆకలితో అలమటిస్తుంటే.. పాలక వర్గం మాత్రం విదేశాల్లో 'అఘాజాదే' (అధికారుల పిల్లలు) పేరిట విలాసవంతమైన జీవితాలను గడుపుతోందని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న మోజ్తబా పేరు మీద ఈ తరహా అవినీతి ఆరోపణలు రావడం ఇరాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం ఖమేనీ కుటుంబాన్ని అత్యంత పేదరికంలో ఉండే 'ఫకీర్' కుటుంబంలా చిత్రీకరిస్తోంది. కానీ, విదేశీ నిఘా సంస్థల విశ్లేషణ ప్రకారం.. మోజ్తబా కేవలం ఆస్తులు కలిగి వుండడమే కాకుండా, ఇరాన్ సైనిక విభాగం 'రివల్యూషనరీ గార్డ్స్'పై కూడా బలమైన పట్టు కలిగి ఉన్నారు. తాజా బహిర్గతం ఇరాన్ అంతర్గత రాజకీయాలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. 
Mojtaba Khamenei
Iran
Ayatollah Ali Khamenei
London Billionaires Row
Iranian Oil Money
Ali Ansari
The Bishops Avenue
Iran Revolutionary Guard Corps
Europe assets

More Telugu News