Telangana Economy: తెలంగాణ ఆర్థిక ప్రగతికి కేంద్రం కితాబు: తగ్గుతున్న ద్రవ్యోల్బణం.. పెరుగుతున్న జీడీపీ!

Telangana Economy Praised by Central Government for Growth and Inflation Control
  • సొంత పన్ను వనరుల ద్వారా ఆదాయాన్ని గడించడంలో తెలంగాణ అగ్రపథం
  • 2022లో 8.6 శాతంగా ఉన్న ధరల పెరుగుదల రేటు ప్రస్తుతం 0.20 శాతానికి పతనం
  • 2035 నాటికి 201 బిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా హైదరాబాద్ ఎదిగే అవకాశం
దేశ ఆర్థిక ముఖచిత్రంలో తెలంగాణ తనదైన ముద్ర వేస్తోందని కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 ప్రశంసించింది. రాష్ట్రం తన సొంత వనరుల నుంచే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటూ 12.6 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయడం విశేషమని పేర్కొంది. ముఖ్యంగా సామాన్యుడిని వేధించే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో తెలంగాణ సాధించిన ప్రగతిని సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సర్వే వెల్లడించింది. 2014లో కేవలం 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం.. కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి పథకాల ఫలితంగా 2023 నాటికి 2.21 కోట్ల ఎకరాలకు చేరుకుంది. అయితే, ప్రకృతి విపత్తుల కారణంగా హెక్టారుకు వచ్చే దిగుబడి జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.

పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. మహిళల రక్షణ కోసం హైదరాబాద్‌లో అమలు చేస్తున్న 'షీ టీమ్స్' ఒక కీలకమైన మరియు ప్రభావవంతమైన విధానమని కేంద్రం కొనియాడింది. ఉత్పాదక రంగంలో 60 శాతం ఉపాధి కల్పిస్తున్న టాప్-7 రాష్ట్రాల్లో తెలంగాణ చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. 2018 ధరల ప్రకారం హైదరాబాద్ జీడీపీ ప్రస్తుతం 50.6 బిలియన్ డాలర్లు కాగా.. 2035 నాటికి ఇది ఏకంగా 201.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనాలను సర్వే ఉటంకించింది.

'భూ భారతి' పోర్టల్ ద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ విభాగాలను ఏకీకృతం చేయడాన్ని ఒక గొప్ప సంస్కరణగా అభివర్ణించింది.  న్యూయార్క్, లండన్ వంటి గ్లోబల్ సిటీల స్థాయికి మన మెట్రో నగరాలను తీసుకెళ్లడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. ఆర్థిక ప్రగతిలో (8.47 శాతం వృద్ధి రేటు) హైదరాబాద్ మిగతా నగరాల కంటే ముందంజలో ఉండటం తెలంగాణకు కలిసొచ్చే అంశం. అటు పారిశ్రామికంగా, ఇటు సామాజిక భద్రతలో రాష్ట్రం చూపిస్తున్న చొరవ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.
Telangana Economy
Telangana
Economic Survey 2025-26
GSDP Growth
Inflation Control
Agriculture Sector
Kaleshwaram Project
Mission Kakatiya
She Teams Hyderabad
Hyderabad GDP

More Telugu News