మయన్మార్ 'స్కామ్ మాఫియా' కథ ముగిసింది: 11 మంది మింగ్ ఫ్యామిలీ సభ్యులకు చైనా ఉరి!

  • మయన్మార్‌లోని కోకాంగ్ ప్రాంతంలో వేల కోట్ల సైబర్ మోసాలు
  • నిందితుడు మింగ్ కుటుంబంపై చైనా ఉక్కుపాదం
  • 14 మంది చైనా పౌరుల హత్య, అక్రమ నిర్బంధం, కిడ్నాపులే లక్ష్యంగా సాగిన మాఫియా ఆగడాలు
  • సుప్రీం కోర్టు ఆమోదంతో నటి, మాజీ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు సహా 11 మందికి మరణశిక్ష అమలు
ఆగ్నేయాసియా దేశాల్లో వేళ్లూనుకున్న అతిపెద్ద సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌పై చైనా ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించింది. మయన్మార్ సరిహద్దు కేంద్రంగా బిలియన్ డాలర్ల స్కామ్ సామ్రాజ్యాన్ని నడిపిన 'మింగ్' కుటుంబానికి చెందిన 11 మంది కీలక సభ్యులకు గురువారం మరణశిక్ష అమలు చేసినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

మయన్మార్‌లోని ఉత్తర ప్రాంతాన్ని పాలిస్తున్న 'నాలుగు ప్రధాన నేర కుటుంబాల్లో మింగ్ ఫ్యామిలీ అత్యంత క్రూరమైనది. వీరి నేతృత్వంలోని ముఠా 'క్రౌచింగ్ టైగర్ విల్లా' వంటి భారీ కాంపౌండ్లలో వేలాది మందిని బందీలుగా ఉంచి, వారి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేది. ఎవరైనా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వారిని కాల్చి చంపడమో, తీవ్రంగా హింసించడమో చేసేవారు. ఈ క్రమంలోనే 14 మంది చైనా పౌరులు ప్రాణాలు కోల్పోవడం బీజింగ్‌ను ఆగ్రహానికి గురిచేసింది.

ఈ ముఠాకు నాయకుడైన మింగ్ జుయ్‌చాంగ్ (గతంలో మయన్మార్ పార్లమెంట్ సభ్యుడు) 2023లో అరెస్టయిన తర్వాత జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఉరిశిక్ష పడ్డ వారిలో అతడి కుమారుడు మింగ్ గువోపింగ్, మనవరాలు మింగ్ జెన్‌జెన్ కూడా ఉన్నారు. సెప్టెంబర్‌లో చైనా కోర్టు వీరికి మరణశిక్ష విధించగా.. నిందితులు చేసిన అప్పీల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. శిక్ష అమలుకు ముందు వీరికి తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించారు.

మయన్మార్ సరిహద్దులోని కోకాంగ్, లౌక్కైంగ్ ప్రాంతాలు చట్టానికి చుట్టాల్లా మారాయి. ఇక్కడి స్కామ్ సెంటర్ల ద్వారా ఏటా సుమారు $43 బిలియన్ల (రూ. 3.5 లక్షల కోట్ల పైమాటే) సొమ్ము ప్రపంచవ్యాప్తంగా లూటీ అవుతున్నట్లు అంచనా. బాధితులతో ప్రేమ నటించి, పెట్టుబడుల పేరిట ముంచే 'రొమాన్స్ స్కామ్' ఇక్కడ ప్రధానం. భారత్ సహా పలు దేశాల యువకులను ఐటీ కొలువుల పేరుతో ఆకర్షించి, అక్కడ బందీలుగా మార్చుకుంటున్నారు.

 ఈ మరణశిక్షల అమలుతో ఆగ్నేయాసియాలోని ఇతర స్కామ్ ముఠాలకు చైనా గట్టి హెచ్చరిక పంపింది. సరిహద్దుల్లోని జూద గృహాలు, డ్రగ్స్ మాఫియా, ఆన్‌లైన్ మోసాలను పూర్తిగా తుడిచిపెట్టే వరకు వేట కొనసాగుతుందని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇటీవల థాయిలాండ్, కాంబోడియా దేశాలతో కలిసి చైనా జరిపిన మెరుపు దాడుల్లో వేలాది మంది స్కామర్లు పట్టుబడ్డారు. 


More Telugu News