Gold Price: ఆగని పసిడి పరుగు.. రికార్డు ధరల్లోనూ కొనేందుకు జనం క్యూలు!

Gold Price Surge Continues Record Prices Attract Buyers
  • రియల్ ఎస్టేట్‌ను వదిలి పసిడి, వెండి వైపు మళ్లుతున్న ఇన్వెస్టర్లు
  • పాత నగలను బ్యాంకుల్లో తనఖా పెట్టి కొత్త బంగారం కొంటున్న జనం
  • బంగారం రుణాల కోసం ఎగబడుతున్న జనం.. చేతులెత్తేస్తున్న బ్యాంకులు
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. బంగారం ధర ఎక్కడితో ఆగుతుంది? రెండు మూడు నెలలుగా పసిడి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నా, కొనుగోలుదారులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా "మించిన తరుణం లేదు" అన్న చందంగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారం, వెండి వేటలో పడ్డారు. గత 10 రోజుల్లోనే తులం బంగారంపై రూ. 32 వేలు, కిలో వెండిపై రూ. 96 వేలు పెరగడం మార్కెట్ చరిత్రలోనే ఒక సంచలనం.

చేతిలో నగదు లేకపోయినా, ఇంట్లో ఉన్న పాత నగలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మరీ కొత్త బంగారం కొంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'సెకండ్ బాంబే'గా పేరుగాంచిన ప్రొద్దుటూరులో పలు బ్యాంకులు గురువారం రోజంతా గోల్డ్ లోన్లు ఇచ్చి, చివరకు 'నగదు లేదు' అనే బోర్డులు పెట్టే స్థాయికి చేరాయి. ఒకే రోజు ఒక చిన్న బ్రాంచ్ రూ. 2 కోట్ల రుణాలు ఇచ్చిందంటే, ఈ 'గోల్డ్ రష్' ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.

నిన్నటి వరకు భూములపై పెట్టుబడి పెట్టిన వారు సైతం ఇప్పుడు పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్ధంగా ఉండటంతో, బిల్డర్లు సైతం ఇళ్లు కట్టడం కంటే బంగారం కొనడమే లాభదాయకమని భావిస్తున్నారు. "ఏడాది పాటు ఇల్లు కట్టి అమ్మితే వచ్చే లాభం కంటే, పది రోజుల్లో బంగారం ఇస్తున్న లాభమే ఎక్కువ" అని ఓ బిల్డర్ వ్యాఖ్యానించడం విశేషం.

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం వల్ల ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. త్వరలోనే తులం బంగారం రూ. 2.50 లక్షలకు, కిలో వెండి రూ. 5 లక్షలకు చేరుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఇన్వెస్టర్లను మరింతగా ఉసిగొల్పుతున్నాయి. ప్రొద్దుటూరు మార్కెట్‌లో గురువారం రాత్రి తులం బంగారం రూ. 2.10 లక్షలు పెట్టి మరీ అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకోవడం గమనార్హం.
Gold Price
Gold Rate Telugu States
Gold Investment
Silver Rate
Proddutur Gold Market
Hyderabad Real Estate
Gold Loans
Central Banks Gold Reserves
International Market Gold
Telugu News Gold Price

More Telugu News