Raipur Central Jail: జైల్లో ప్రియుడి పుట్టినరోజు.. వీడియో తీసి పోస్ట్ చేసిన యువతి!

Raipur Central Jail Prisoner Girlfriend Viral Video
  • భద్రతా నియమాలు ఉల్లంఘించి ఫోన్ లోపలికి తీసుకెళ్లిన వైనం
  • ప్రియుడి పుట్టినరోజు సందర్భంగా కలుసుకున్న యువ‌తి
  • గతంలోనూ ఇదే జైలు నుంచి ఖైదీల వీడియోలు వైరల్
  • ఘటనపై ఇంకా స్పందించని జైలు అధికారులు
ఛత్తీస్‌గఢ్‌లోని అత్యంత భద్రత కలిగిన రాయ్‌పూర్ సెంట్రల్ జైలులో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఓ యువతి తన ప్రియుడిని కలిసేందుకు జైలుకు వచ్చి, విజిటింగ్ రూమ్‌లో అతనితో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. జైలులోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంపై కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, ఈ ఘటన జరగడంతో అధికారుల పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైరల్ అయిన వీడియోలో ఆ యువతి భావోద్వేగంగా మాట్లాడుతూ.. "ఈ రోజు నా లవర్ పుట్టినరోజు. అతడిని కలవడానికి సెంట్రల్ జైలుకు వచ్చాను. ఈ పుట్టినరోజుకి అతను నాతో లేడనే విషయం చాలా బాధపెడుతోంది. అయినా అతడిని చూడటానికి వచ్చాను. అతని స్పందన ఎలా ఉంటుందో చూద్దాం" అని చెప్పింది. ఈ వీడియోలో కనిపించిన ఖైదీని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద అరెస్టయిన తారకేశ్వర్‌గా గుర్తించారు. ఈ వీడియోకి 'ఖుదా గవా' సినిమాలోని 'తూ నా జా మేరే బాద్‌షా' పాటను జోడించి ఆమె సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.

రాయ్‌పూర్ జైలులో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఖైదీలు జైలు నుంచే వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసి కలకలం రేపారు. కొన్ని నెలల క్రితం, మహ్మద్ రషీద్ అలీ అనే ఓ ఖైదీ జైల్లో జిమ్ చేస్తూ, తోటి ఖైదీలతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతనిపై హత్య, ఎన్‌డీపీఎస్‌, ఆయుధాల చట్టం కింద పదికి పైగా కేసులున్నాయి. అంతకుముందు జార్ఖండ్ గ్యాంగ్‌స్టర్ అమన్ సా జైల్లో ఫోటోషూట్ నిర్వహించడం సంచలనమైంది.

వరుస ఘటనలతో అత్యంత పటిష్ఠ‌మైన భద్రత ఉండాల్సిన సెంట్రల్ జైలు ఖైదీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఖైదీలు, జైలు అధికారుల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. తాజా ఘటనపై జైలు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Raipur Central Jail
Chhattisgarh
jail security
Tarkeshwar
NDPS Act
jail video
social media
crime
jailbreak

More Telugu News