Direct Flights: బంగ్లా, పాక్‌ మధ్య బలపడుతున్న బంధం.. 14 ఏళ్ల విరామం తర్వాత నేరుగా విమానాలు

Bangladesh Pakistan Resume Direct Flights After 14 Years
  • ఇరు దేశాల మ‌ధ్య  2012 నుంచి నిలిచిపోయిన డైరెక్ట్‌ విమాన‌ సర్వీసులు  
  • తాజాగా విమాన స‌ర్వీసుల‌ను పునరుద్ధరించిన బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్
  • బంగ్లాదేశ్‌లో రాజకీయ మార్పుల తర్వాత పాకిస్థాన్‌తో మెరుగవుతున్న సంబంధాలు
  • ఈ నిర్ణయంతో వాణిజ్య, సాంస్కృతిక బంధాలు బలపడతాయని అంచనా
బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య దశాబ్దానికి పైగా నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్న‌ ఢాకా నుంచి 150 మంది ప్రయాణికులతో బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి బయల్దేరింది. 2012 తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఇదే తొలి రెగ్యులర్ విమాన సర్వీసు కావడం గమనార్హం.

ఇంతకాలం బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య ప్రయాణించాలంటే దుబాయ్, దోహా వంటి దేశాల మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో వెళ్లాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో ఇకపై వారానికి రెండుసార్లు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నామని, ఇకపై సులభంగా ప్రయాణించవచ్చని మహమ్మద్ షాహిద్ అనే ప్రయాణికుడు ఆనందం వ్యక్తం చేశారు.

2024లో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పాకిస్థాన్‌తో ఆ దేశ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇదే సమయంలో ఒకప్పటి మిత్రదేశమైన భారత్‌తో బంధాలు కొంత బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 2024 నవంబర్‌లో కరాచీ నుంచి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టుకు కార్గో షిప్‌లు కూడా ప్రారంభమయ్యాయి. తాజా విమాన సర్వీసుల పునరుద్ధరణతో వాణిజ్యం, విద్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడతాయని బిమాన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.

1971లో జరిగిన యుద్ధం తర్వాత పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన విషయం తెలిసిందే. భౌగోళికంగా ఈ రెండు దేశాల మధ్య దాదాపు 1500 కిలోమీటర్ల భారత భూభాగం ఉంది.
Direct Flights
Bangladesh Pakistan Relations
Biman Bangladesh Airlines
Karachi
Dhaka
Sheikh Hasina
India Bangladesh relations
Bangladesh Pakistan flights
Chittagong port
Cargo ships

More Telugu News