Hyderabad: దక్షిణ భారత్‌లో ‘కాలుష్య’ రాజధానిగా హైదరాబాద్‌

Hyderabad Named Pollution Capital of South India
  • దక్షిణాది మెట్రో నగరాల్లో అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరంగా హైదరాబాద్ 
  • డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన ప్రమాణాల కంటే రెట్టింపు స్థాయిలో సూక్ష్మ ధూళికణాలు
  • కాలుష్య కేంద్రాలుగా మారిన ప్రధాన ట్రాఫిక్ కారిడార్లు
భాగ్యనగరం వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెల్లడించింది.

గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఎయిర్‌ పొల్యూషన్‌ ఇండెక్స్’ సదస్సులో పీసీబీ విడుదల చేసిన గణాంకాలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాలు (PM-10) 40 మైక్రోగ్రాములు ఉండాలి. కానీ, హైదరాబాద్‌లో ఇది 82 నుంచి 88 ఎంజీల వరకు ఉంటోంది. అంటే ఉండాల్సిన దానికంటే రెట్టింపు కాలుష్యాన్ని మనం పీలుస్తున్నాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పరిమితి 60 ఎంజీతో పోల్చినా, హైదరాబాద్‌లో 35 శాతం అధిక కాలుష్యం ఉన్నట్లు స్పష్టమైంది.

గత ఏడాది పొడవునా నగరంలో ఒక్క రోజు కూడా ‘స్వచ్ఛమైన గాలి’ ఉన్నట్లు రికార్డు కాలేదు. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) కేవలం ‘మధ్యస్థం’ లేదా ‘సంతృప్తికరం’ స్థాయిలకే పరిమితమైంది. ఈ ఏడాది జనవరిలో పీఎం-10 స్థాయి గరిష్ఠంగా 105 ఎంజీ వరకు వెళ్లడం నగర గాలిలో పెరుగుతున్న విషతుల్యతకు నిదర్శనం.

 నగరంలో వాహనాల రద్దీ పెరగడంతో ఏడు ప్రధాన ప్రాంతాలను 'కాలుష్య హాట్‌స్పాట్లు'గా అధికారులు గుర్తించారు. అవి ఖైరతాబాద్‌-కోఠి, జీడిమెట్ల, బీహెచ్‌ఈఎల్‌-అమీర్‌పేట, నాంపల్లి-చార్మినార్, మెహిదీపట్నం-హైటెక్‌సిటీ-కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌-సైనిక్‌పురి, ఎల్‌బీనగర్‌-కోఠి. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని పీసీబీ స్పష్టం చేసింది.

వాయు కాలుష్యం పెరగడానికి కేవలం వాహనాలే కాకుండా, నగర శివార్లలో జరుగుతున్న నిర్మాణ పనులు, పరిశ్రమల ఉద్గారాలు కూడా ప్రధాన కారణమవుతున్నాయి. పీఎం-10 స్థాయి పెరగడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచకపోతే గాలి నాణ్యత మరింత పడిపోయే ప్రమాదం ఉంది. 
Hyderabad
Hyderabad pollution
Air pollution Hyderabad
Telangana pollution
South India pollution
Air Quality Index
PM10 levels
Pollution hotspots Hyderabad
Environmental issues India

More Telugu News