వారణాసి నుంచే ‘వారణాసి’ అప్‌డేట్.. రాజమౌళి-మహేశ్‌ బాబు సినిమా రిలీజ్ డేట్ ఇదేనా?

  • 2027 ఏప్రిల్ 7న విడుదలంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
  • వారణాసి నగరంలో వెలిశాయంటున్న కొన్ని హోర్డింగ్సే దీనికి కారణం 
  • ఈ తేదీపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాని వైనం
  • ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం
స్టార్‌ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై ఒక ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. ‘వారణాసి’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక తేదీ వైరల్ అవుతోంది. 

ఈ చిత్రంలో మహేశ్‌ బాబు సరసన హాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనస్ నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్నారు. అయితే, తాజా ప్రచారానికి వారణాసి నగరంలో వెలిశాయంటున్న కొన్ని హోర్డింగ్స్ కారణమయ్యాయి. సినిమా టైటిల్ ఉన్న నగరంలోనే విడుదల తేదీ బయటకు వచ్చిందంటూ వార్తలు చక్కర్లు కొట్టడంతో అభిమానుల్లో ఉత్కంఠ రెట్టింపైంది. అలాగే ఆ రోజు తెలుగునాట ఉగాది, ఉత్త‌రాదిలో గుడి ప‌డ్వా పండుగలు ఉండ‌డంతో జ‌క్క‌న్న ఇలా మూవీ విడుద‌ల‌కు ప్లాన్ చేసి ఉంటార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  ఇది నిజమైన ప్రచారమా? లేక ఫ్యాన్ మేడ్ హైప్‌ మాత్రమేనా? అనే చర్చ కూడా జరుగుతోంది.

అయితే, ఈ విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని, అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మవద్దని సినీ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్ గతంలో సూచనప్రాయంగా తెలిపారు.

ఏదేమైనా ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. రాజమౌళి-మహేశ్‌ బాబుల కలయికలో వస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News