Smriti Mandhana: డబ్ల్యూపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ

Smriti Mandhana Leads RCB to WPL Final Victory
  • యూపీ వారియర్జ్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
  • గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన మెరుపు అర్ధశతకాలు
  • నాలుగు వికెట్లతో యూపీని దెబ్బతీసిన నడిన్ డి క్లర్క్
  • 144 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలోనే ఛేదించిన బెంగళూరు
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు సంక్లిష్టంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొన్న స్మృతి మంధాన సేన, కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించి, టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్ చేరింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ, యూపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్జ్‌కు ఓపెనర్లు కెప్టెన్ మెగ్ లానింగ్ (30 బంతుల్లో 41), దీప్తి శర్మ మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని నడిన్ డి క్లర్క్ విడదీసింది. లానింగ్ ఔటైన తర్వాత యూపీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకవైపు దీప్తి శర్మ (43 బంతుల్లో 55) ఒంటరి పోరాటంతో అర్ధశతకం పూర్తి చేసినా, మరో ఎండ్‌లో సహకారం కరువైంది. అమీ జోన్స్ (1), హర్లీన్ డియోల్ (14), క్లో ట్రయాన్ (6) వంటి కీలక బ్యాటర్లు విఫలమవడంతో యూపీ వేగంగా వికెట్లు కోల్పోయింది.

ఆర్సీబీ బౌలర్లలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నడిన్ డి క్లర్క్ అద్భుతంగా రాణించింది. కేవలం 22 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి యూపీ పతనాన్ని శాసించింది. ఆమె ధాటికి యూపీ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. గ్రేస్ హారిస్ రెండు వికెట్లు, లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీయడంతో యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.

144 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు గ్రేస్ హారిస్, కెప్టెన్ స్మృతి మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి ఓవర్ నుంచే యూపీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా గ్రేస్ హారిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. కేవలం 37 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 108 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

హారిస్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జార్జియా వోల్ (16)తో కలిసి మంధాన ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన మంధాన, తర్వాత గేరు మార్చి కేవలం 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ కేవలం 13.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, ఫైనల్‌కు అర్హత సాధించింది.


Smriti Mandhana
WPL 2024
Royal Challengers Bangalore
RCB
UP Warriorz
Nadine de Klerk
Grace Harris
Womens Premier League
Cricket
Womens Cricket

More Telugu News