Chandrababu Naidu: గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదిగో!

Chandrababu Naidu Tour Schedule in Guntur and Kuppam
  • గుంటూరులో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం
  • మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
  • కుప్పంలో రూ.675 కోట్ల పెట్టుబడులతో ఏడు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు
  • 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఎంఓయూలపై సంతకాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పర్యటనకు సిద్ధమయ్యారు. గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించి పలు కీలక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన అనంతరం, మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ.690 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో సీఎం పాల్గొంటారు.

పర్యటనలో భాగంగా శుక్రవారం ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు (జింకానా) అందించిన రూ.100 కోట్ల భారీ విరాళంతో ఈ భవనాన్ని నిర్మించారు. విశేషమేమిటంటే, 2018లో ఈ భవనానికి చంద్రబాబే శంకుస్థాపన చేయగా, ఇప్పుడు ఆయనే దీనిని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.27 కోట్లు కేటాయించింది.

గుంటూరు కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు కుప్పం పయణమవుతారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు నియోజకవర్గంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. తొలి రోజు మధ్యాహ్నం 2:35 గంటలకు కుప్పం చేరుకుని రూ.3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ప్రారంభిస్తారు. 

అనంతరం రూ.10 కోట్లతో నిర్మించనున్న 'లెర్నర్స్ అకామిడేషన్' సెంటర్‌కు, రూ.2 కోట్లతో చేపట్టే ఓబెరాయ్ విజిటర్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు ఆదిత్య బిర్లా మల్టీ-స్కిల్ సెంటర్‌ను, పర్యాటక అభివృద్ధిలో భాగంగా కాంగుంది హెరిటేజ్ విలేజ్, బౌల్డరింగ్ పార్క్, పున్నమి రిసార్ట్‌లను ప్రారంభిస్తారు.

పర్యటనలో రెండో రోజైన శనివారం అత్యంత కీలకం కానుంది. ఉదయం బెగ్గులపల్లె పంచాయతీలో అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లను సీఎం స్వయంగా పంపిణీ చేస్తారు. అనంతరం 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కుప్పం పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా ఏడు కొత్త పరిశ్రమలతో ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకోనున్నారు. ఈ ఒప్పందాల ద్వారా కుప్పంలో రూ.675.24 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 12,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

ఎంఏఎఫ్ క్లాతింగ్ (రూ.200 కోట్లు), న్యూట్రీ ఫీడ్స్ (రూ.180 కోట్లు), ఇన్-ఫేజ్ వరల్డ్ పార్క్ (రూ.137.1 కోట్లు) వంటి సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. 

ఇదే రోజున కుప్పం మాస్టర్ ప్లాన్‌ను, మోడల్ బస్ స్టాండ్ డిజైన్లను సమీక్షిస్తారు. ఇక పర్యటన చివరి రోజైన ఆదివారం పార్టీ శ్రేణులతో, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కమిటీతో సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు. ఆదివారం సాయంత్రం అమరావతికి తిరుగు పయనమవుతారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Kuppam
Guntur
AP CM
social security pensions
development projects
MOU agreements
industrial progress
health center

More Telugu News