Chandrababu Naidu: ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu releases AP Cancer Atlas
  • క్యాన్సర్‌ను నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్
  • రాష్ట్రవ్యాప్తంగా 2.9 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించి అట్లాస్ రూపకల్పన
  • ప్రాంతాల వారీగా రోగులను గుర్తించి స్థానికంగా చికిత్స అందించడమే లక్ష్యం
  • 2030 నాటికి క్యాన్సర్ కేసులు 20 శాతం పెరిగే అవకాశం ఉందన్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడు 
ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ మహమ్మారిని సమర్థంగా నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా రూపొందించిన 'ఏపీ క్యాన్సర్ అట్లాస్'ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు ఆవిష్కరించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి సీఎం ఈ అట్లాస్‌ను విడుదల చేశారు. క్యాన్సర్ వ్యాధిని అధికారికంగా నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.

వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో చేపట్టిన విస్తృతస్థాయి స్క్రీనింగ్ పరీక్షల ఆధారంగా ఈ క్యాన్సర్ అట్లాస్‌ను రూపొందించారు. తొలిదశలో సుమారు 2.9 కోట్ల మంది ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వారి వివరాలను నమోదు చేశారు. ఈ సమాచారంతో రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఏయే ప్రాంతాల్లో ఎంతమంది, ఏ రకమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నారో స్పష్టంగా గుర్తించేందుకు వీలవుతుంది. దీనివల్ల రోగులకు స్థానికంగానే మెరుగైన చికిత్స అందించడం సులభతరం అవుతుంది.

ఈ అట్లాస్ ద్వారా 'విజన్-2030' లక్ష్యంగా క్యాన్సర్ బాధితులకు అధునాతన చికిత్స అందించడం, ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలతో వ్యాధిగ్రస్తుల సంఖ్యను తగ్గించడం వంటివి చేపట్టనున్నారు. ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, నివారణ, ముందస్తు గుర్తింపు వంటివి ఈ వ్యూహంలో కీలక అంశాలుగా పొందుపరిచారు. పురుషులు, మహిళల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సర్జికల్, రేడియేషన్, మెడికల్ ట్రీట్‌మెంట్ వంటి చికిత్సా విధానాలను కూడా అట్లాస్‌లో పొందుపరిచారు.

ఈ సందర్భంగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీలో 32,657 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని తెలిపారు. ఐసీఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి ఈ సంఖ్య 20 శాతం పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ అట్లాస్ ద్వారా రోగులను మ్యాపింగ్ చేసి రాష్ట్రంలోని 23 బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రుల ద్వారా డే కేర్ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ వంటి చికిత్సలు అందించవచ్చని అన్నారు. 

మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైల సహకారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ ప్రచారంతో ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన పెరిగిందని, ముందస్తు పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
AP Cancer Atlas
Andhra Pradesh
Cancer screening
Dr Nori Dattatreyudu
Cancer treatment
Healthcare
Vision 2030
Cervical cancer
HPV vaccination

More Telugu News