Narendra Modi: అగ్రరాజ్య పెద్దలకు భారత నేతల బహుమతులు... వివరాలు విడుదల

Narendra Modi Gifts to US Leaders Details Released
  • బైడెన్‌కు ప్రధాని మోదీ నుంచి ఖరీదైన బహుమతులు
  • రూ.6.5 లక్షల విలువైన వెండి రైలు సెట్‌ను అందించిన మోదీ
  • కమలా హారిస్, ఇతర ఉన్నతాధికారులకూ అందిన కానుకలు
  • వివరాలు వెల్లడించిన అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక
  • అందుకున్న బహుమతులను జాతీయ ఆర్కైవ్స్‌కు అప్పగింత
భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర భారతీయ నాయకులు నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర ఉన్నతాధికారులకు అందించిన ఖరీదైన కానుకల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ జాబితాలో అత్యంత ఖరీదైనది, ప్రత్యేకమైనది ప్రధాని మోదీ.. బైడెన్‌కు ఇచ్చిన రూ.6.5 లక్షల ($7,750) విలువైన స్టెర్లింగ్ సిల్వర్ రైలు సెట్. ఈ బహుమతిని అమెరికా నిబంధనల ప్రకారం జాతీయ పురావస్తు భాండాగారానికి (నేషనల్ ఆర్కైవ్స్ - NARA) తరలించారు.

అమెరికా విదేశాంగ శాఖ 2024 క్యాలెండర్ సంవత్సరానికి గాను ఈ నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వ అధికారులు స్వీకరించే బహుమతుల విలువ 480 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే, వాటి వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం, 2024 జూలై 16న ప్రధాని మోదీ.. బైడెన్‌కు ఈ ప్రత్యేకమైన వెండి రైలు సెట్‌ను బహూకరించారు. దీని విలువ 7,750 డాలర్లుగా అంచనా వేశారు. అంతకుముందు, 2023 సెప్టెంబర్ 10న కూడా బైడెన్‌కు మోదీ నుంచి 562 డాలర్ల విలువైన బహుమతులు అందాయి. వాటిలో చెక్క పెట్టె, ఒక స్కార్ఫ్, కుంకుమపువ్వు ఉన్న జాడీ, టీ పొడి బాక్స్ ఉన్నాయి. టీ, కుంకుమపువ్వు వంటివి వాడి పారేసేవి కావడం వల్ల, మిగిలిన వస్తువులను నేషనల్ ఆర్కైవ్స్‌కు బదిలీ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

అధ్యక్షుడు బైడెన్‌కే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులకు, ఇతర ఉన్నతాధికారులకు కూడా భారత నాయకుల నుంచి కానుకలు అందాయి. ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు 2024 అక్టోబర్ 21న ప్రధాని మోదీ 2,969 డాలర్ల విలువైన పష్మినా శాలువాను బహుమతిగా ఇచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు 2024 అక్టోబర్ 18న రూ.1.11 లక్షల ($1,330) విలువైన 'లార్డ్ కృష్ణ రాసలీల సిల్వర్ బాక్స్' అందింది. అదే రోజున, ఆమె భర్త, సెకండ్ జెంటిల్‌మన్ డగ్లస్ ఎమ్హాఫ్‌కు 585.65 డాలర్ల విలువైన కఫ్‌లింక్స్‌ను మోదీ అందించారు. ఈ బహుమతులన్నింటినీ నేషనల్ ఆర్కైవ్స్‌కు తరలించారు.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్‌కు కానుక అందించారు. 2024 ఆగస్టు 23న ఆయనకు 599 డాలర్ల విలువైన కశ్మీర్ పష్మినా స్కార్ఫ్‌ను బాక్సుతో సహా బహూకరించారు. దీనిని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (GSA)కు బదిలీ చేశారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం 2022 నవంబర్ 24న అప్పటి అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్‌కు 3,700 డాలర్ల విలువైన శివ నటరాజ కాంస్య విగ్రహాన్ని ఇచ్చారు. ఈ విగ్రహాన్ని GSAకు బదిలీ చేసే ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. కొన్ని బహుమతుల సమాచారం ఆలస్యంగా అందడం వల్ల, పాత తేదీలతో ఉన్నవి కూడా ఈ నివేదికలో చేర్చినట్లు అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో భాగంగా ఇలాంటి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధారణమే. అయితే, స్వీకరించిన బహుమతులను తిరస్కరిస్తే దాతకు, అమెరికా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుందనే ప్రామాణిక కారణంతో వాటిని స్వీకరిస్తామని నివేదికలో స్పష్టం చేశారు. ఈ బహుమతుల విలువ, దాతల వివరాల కచ్చితత్వానికి సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహిస్తాయని కూడా పేర్కొన్నారు.


Narendra Modi
Joe Biden
India US relations
Gifts to US leaders
Sterling silver train set
Pashmina shawl
Kamala Harris
Ajit Doval
Rajnath Singh
National Archives

More Telugu News