Kollu Ravindra: జగన్‌కు దమ్ముంటే 11వ తేదీన అసెంబ్లీకి 11మంది సభ్యులతో రావాలి: మంత్రి కొల్లు రవీంద్ర సవాల్

Kollu Ravindra Challenges Jagan to Assembly Debate on Ghee Adulteration
  • తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందన్న మంత్రి కొల్లు రవీంద్ర
  • ఈ అంశంపై చర్చకు అసెంబ్లీకి రావాలని జగన్‌కు సవాల్
  • నిబంధనలు సడలించి పాలు లేని నెయ్యిని కొనుగోలు చేశారని ఆరోపణ
  • నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు, రసాయనాలు ఉన్నాయని వెల్లడి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి విషయంలో గత వైసీపీ ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చించేందుకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ నెల 11న జరిగే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది సభ్యులతో రావాలని వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు.

ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర, జగన్ ఐదేళ్ల పాలనలో శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసే అపవిత్ర కార్యానికి తెరలేపారని తీవ్రంగా విమర్శించారు. కేవలం దోపిడీ కోసమే తనకు అనుకూలమైన డెయిరీలకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలు సడలించారని ఆరోపించారు. "4 లక్షల లీటర్ల ఆవుపాలు కావాలనే నిబంధనను ఎందుకు ఎత్తివేశారు? పాలే లేని డెయిరీలకు నెయ్యి ఆర్డర్లు ఇచ్చి, హవాలా రూపంలో ముడుపులు అందుకున్నారు" అని దుయ్యబట్టారు.

రసాయనాలతో తయారు చేసిన ఈ నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసిందని మంత్రి తెలిపారు. లడ్డూ కోసం వాడిన నకిలీ పదార్థాల్లో మోనో గ్లిజరైట్, మీటా క్యారటిన్, ఎసిడిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలు వెలుగు చూశాయని వివరించారు. మోనో గ్లిజరైట్‌లో జంతు లేదా వెజిటేబుల్ కొవ్వు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారని పేర్కొన్నారు.

"జగనే ఒక కల్తీ. కల్తీ నాయకులతో గత ఐదేళ్లు కల్తీ ప్రభుత్వాన్ని నడిపారు. దైవంపై నమ్మకం లేకపోవడం వల్లే తిరుమలపై ఇలాంటి అపవిత్ర కుట్రలకు పాల్పడ్డారు. దేవుడితో ఆటలాడిన జగన్ అందుకు తగ్గ ఫలితం అనుభవించి తీరుతారు" అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక వచ్చాక మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
Kollu Ravindra
Andhra Pradesh
TDP
YS Jagan
Tirumala
SriVari Laddu
Ghee Adulteration
Assembly
Corruption
Tirupati

More Telugu News