అజిత్ పవార్ విమాన దుర్ఘటన... బ్లాక్ బాక్స్ దొరికింది!

  • బారామతి సమీపంలో ఘోర విమాన ప్రమాదం
  • మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి
  • బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
బారామతి సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన ఘటనపై దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు గురువారం ఆయన అధికారికంగా లేఖ రాశారు.

ఈ దురదృష్టకర ఘటన పట్ల కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని రామ్మోహన్ నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని ఉన్నత స్థాయి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

ఫ్లైట్ డేటా రికార్డర్ అయిన బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకోవడం దర్యాప్తులో అత్యంత కీలకమని భావిస్తున్నారు. విమానం చివరి క్షణాల్లో ఏం జరిగిందనే దానిపై ఇది స్పష్టత ఇవ్వనుంది. అధికారులు ప్రస్తుతం సాంకేతిక రికార్డులు, ఆపరేషనల్ లాగ్స్, ఘటనాస్థలంలోని ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ఈ దర్యాప్తు పూర్తి పారదర్శకంగా, నిర్దిష్ట కాలపరిమితిలో జరుగుతుందని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు, ప్రాథమిక, తుది నివేదికల ఆధారంగా అవసరమైన భద్రతాపరమైన సిఫార్సులు, చర్యలు అమలు చేస్తామని ఫడ్నవీస్‌కు హామీ ఇచ్చారు. దర్యాప్తునకు సహకరిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News