Netti Srinivasa Rao: ఏపీలో హోంగార్డు ఆస్తులు రూ.20 కోట్లు... ఏసీబీ సోదాల్లో బట్టబయలు!

Home Guard Netti Srinivasa Rao Assets Worth 20 Crores Unearthed in ACB Raids
  • విజయనగరం హోంగార్డు శ్రీనివాసరావుపై ఏసీబీ మెరుపుదాడులు
  • సుమారు రూ. 20 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తింపు
  • గతంలో ఏసీబీలోనే 15 ఏళ్లు పనిచేసినట్లు వెల్లడి
  • అవినీతి అధికారులకు సమాచారం లీక్ చేసి డబ్బు సంపాదించినట్లు ఆరోపణలు
విజయనగరం జిల్లాలో ఓ హోంగార్డు అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న నెట్టి శ్రీనివాసరావు అనే హోంగార్డు ఇళ్లు, ఇతర ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అతడు ఆదాయానికి మించి సుమారు రూ. 20 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.

శ్రీనివాసరావు గతంలో సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీ విభాగంలోనే హోంగార్డుగా పనిచేయడం గమనార్హం. ఆ సమయంలో ఏసీబీ చేపట్టే దాడుల రహస్య సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని, అవినీతి అధికారులకు చేరవేసేవారని, అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంతోనే గతంలో అతడిని ఏసీబీ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయినప్పటికీ, పాత పరిచయాలతో తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది.

విజయనగరం, విశాఖపట్నం, గుర్ల మండలంలోని శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు విలాసవంతమైన భవనాలు, భూముల పత్రాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ అవినీతి వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 
Netti Srinivasa Rao
Andhra Pradesh
Home Guard
ACB Raids
Corruption
Vizianagaram
Illegal Assets
Visakhapatnam
Gurlam

More Telugu News