Pawan Kalyan: తల్లి పుట్టినరోజున కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan Adopts Giraffes on Mothers Birthday
  • విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • తల్లి పుట్టినరోజు సందర్భంగా రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత
  • జూలో నూతన ఎలుగుబంట్ల ఎన్‍క్లోజర్‌ను ప్రారంభించిన వైనం
  • జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపు
  • కంభాలకొండలో 'నగర వనం' ప్రారంభించి, కనోపీ వాక్
ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నేడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా, తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును పురస్కరించుకుని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాటి సంరక్షణకు ఏడాది పాటు అయ్యే ఖర్చును తానే పూర్తిగా భరిస్తానని తెలిపారు.

ఈ స్ఫూర్తితో జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పర్యటనలో భాగంగా, జూపార్క్‌లో కొత్తగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్‍క్లోజర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏనుగులు, నీటి ఏనుగులు, పులులు, సింహాల ఎన్‍క్లోజర్ల వద్దకు వెళ్లి వాటి వివరాలను జూ క్యూరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. జూ నిబంధనలు పాటిస్తూ ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందించారు.

అనంతరం కంబాలకొండ ఎకో పార్క్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్, అక్కడ ఏర్పాటు చేసిన 'నగర వనం'ను ప్రారంభించారు. పార్క్‌లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేస్తూ, మార్గమధ్యలో ఉన్న మొక్కల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పర్యావరణ పరిరక్షణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం.
Pawan Kalyan
Andhra Pradesh
Deputy CM
Visakhapatnam
Zoo
Giraffe adoption
Environment
Kambalakonda Eco Park
Nagara Vanam
Anjana Devi

More Telugu News