AV Ranganath: హైదరాబాద్‌లో హైడ్రా కొరడా: జూబ్లీహిల్స్ 'నీరూస్‌'కు తాళాలు

Neerus Jubilee Hills Sealed by Hydra for Fire Safety Violations
  • అగ్నిమాపక నిబంధనలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా
  • జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ నీరూస్ షోరూంను సీజ్ చేసిన అధికారులు
  • నాంపల్లిలో మరో ఫర్నిచర్ షోరూంకు కూడా తాళం
  • నాంపల్లి దుర్ఘటన తర్వాత తనిఖీలు ముమ్మరం
  • ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి
హైదరాబాద్ నగరంలో అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపింది. ఇటీవల నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు.. గురువారం జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ వస్త్ర దుకాణం 'నీరూస్' తో పాటు నాంపల్లిలోని మరో ఫర్నిచర్ షోరూంను సీజ్ చేశారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని నీరూస్ షోరూంలో తనిఖీ చేయగా తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడ్డాయి. మూడు సెల్లార్లు, నాలుగు అంతస్తులతో పాటు, అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన రూఫ్ షెడ్‌లో కూడా భారీగా వస్త్రాలను నిల్వ ఉంచడాన్ని అధికారులు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ లేకపోవడం, మంటలను ఆర్పే పరికరాలు సరిగా లేకపోవడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం పై అంతస్తులను గోదాముగా, వస్త్రాల తయారీ కేంద్రంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. వెంటనే షోరూంను సీజ్ చేయాలని ఆదేశించారు.

అనంతరం అధికారులు నాంపల్లి స్టేషన్ రోడ్డులోని రహీమ్, మన్నన్ ఎస్టేట్స్ స్టాండర్డ్ ఫర్నిచర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఇటీవల ఐదుగురి మృతికి కారణమైన ప్రమాదం జరిగిన రోడ్డులోనే ఉన్నప్పటికీ ఈ షోరూంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. ఆరు అంతస్తుల భవనంలో మెట్ల మార్గాన్ని కూడా మూసివేసి ఫర్నిచర్ నిల్వ ఉంచడం, కనీసం ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా లేకపోవడంతో ఈ షోరూంను కూడా సీజ్ చేయాలని ఆదేశించారు.

ఈ రెండు షోరూంల వద్ద 'ఫైర్ అన్ సేఫ్' బోర్డులను ఏర్పాటు చేసి, హైడ్రా ఫెన్సింగ్ వేశారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నగరంలో ఎక్కడైనా ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే, తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలను కోరారు. హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667 లేదా తన వాట్సాప్ నంబర్ 7207923085కు ఫొటోలు, వీడియోలతో సహా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
AV Ranganath
Hyderabad
Neerus
Jubilee Hills
Fire Safety
Building Safety
GHMC
Fire Accident
Fire Safety Violations
Hydra

More Telugu News