Shashi Tharoor: రాహుల్ గాంధీ, ఖర్గేలతో సమావేశమైన శశిథరూర్

Shashi Tharoor Meets Rahul Gandhi and Kharge
  • కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న థరూర్
  • ఈ ఉదయం రాహుల్, ఖర్గేలతో థరూర్ భేటీ
  • అరగంట పాటు కొనసాగిన సమావేశం
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని మోదీని ప్రశంసిస్తూ శశిథరూర్ పలుమార్లు స్పందించారు. దీంతో, కాంగ్రెస్ తో ఆయన సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువైంది. మరోవైపు పార్టీ కీలక సమావేశాలకు కూడా థరూర్ వరుసగా గైర్హాజరు అవుతుండటంతో... ఈ ప్రచారానికి రెక్కలొచ్చినట్టయింది. 

ఈ క్రమంలో ఈరోజు ఆసక్తకర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో శశిథరూర్ భేటీ అయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో దాదాపు 30 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. తనవైపు నుంచి వివరణ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తో సమావేశానికి థరూర్ సమయం కోరినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీరి సమావేశం చోటుచేసుకుంది. 
Shashi Tharoor
Rahul Gandhi
Mallikarjun Kharge
Congress Party
Indian National Congress
Pahalgam Terrorist Attack
Operation Sindoor
Parliament
BJP
India

More Telugu News