Yuvraj Singh: ఎందుకు రిటైర్ అయ్యానంటే.. ఆరేళ్ల త‌ర్వాత‌ అసలు కారణాలు చెప్పిన‌ యువరాజ్

Yuvraj Singh Reveals Real Reasons for Retirement After Six Years
  • తనకు సరైన గౌరవం, మద్దతు లభించలేదని యువీ సంచలన వ్యాఖ్యలు
  • ఆటను ఆస్వాదించలేకపోవడంతోనే క్రికెట్‌ను భారంగా భావించానని వెల్లడి
  • ఆడటం ఆపేసిన రోజే నేను మళ్లీ నాలా మారాను అంటూ వ్యాఖ్య
  • సానియా మీర్జాతో పోడ్‌కాస్ట్‌లో మనసులోని మాటలు పంచుకున్న యువ‌రాజ్‌
భారత మాజీ క్రికెట‌ర్‌, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్‌కు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టాడు. 2019 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలకడానికి దారితీసిన పరిస్థితులను ఆయన తాజాగా వివరించాడు. ఆటలో తనకు సరైన గౌరవం, మద్దతు లభించకపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, అప్పటికే క్రికెట్‌ను ఆస్వాదించడం మానేశానని స్పష్టం చేశాడు. ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో జరిగిన ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో యువీ ఈ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.

2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన యువరాజ్, ఆ వెంటనే తన సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే, కేవలం ఒక్క సిరీస్‌లో విఫలం కావడం వలనో, ఫామ్ కోల్పోవడం వలనో తాను రిటైర్ కాలేదని యువీ తెలిపాడు. మానసికంగా, శారీరకంగా తీవ్రంగా అలసిపోయానని, ఆట ఒక బాధ్యతగా మారిందని అన్నాడు. 

"నేను నా ఆటను ఏమాత్రం ఆస్వాదించలేకపోయాను. నాకు మద్దతుగానీ, గౌరవంగానీ లభిస్తున్నట్లు అనిపించలేదు. ఇవేవీ లేనప్పుడు నేనెందుకు ఆడాలి? ఆస్వాదించలేని దాని కోసం ఎందుకు వేలాడాలి? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆ ఒత్తిడి నన్ను మానసికంగా గాయపరిచింది. ఎప్పుడైతే నేను ఆడటం ఆపేశానో, అప్పుడే మళ్లీ నేను నాలా మారాను. ప్రశాంతంగా అనిపించింది" అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.

మైదానంలో మెరుపులు, గ్లామర్ వెనుక క్రీడాకారులు ఎదుర్కొనే మానసిక సంఘర్షణకు యువరాజ్ మాటలు అద్దం పడుతున్నాయి. ఆటను ఆపేయడం తనను కుంగదీయలేదని, బదులుగా తనకు తానుగా మళ్లీ దొరికేలా చేసిందని ఆయన చెప్పిన తీరు పలువురిని ఆలోచింపజేస్తోంది.

ఇదే సంభాషణలో తన చిన్ననాటి అనుభవాన్ని కూడా యువీ పంచుకున్నాడు. 13-14 ఏళ్ల వయసులో తన ప్రతిభను ఒకరు తక్కువ చేసి మాట్లాడారని గుర్తుచేసుకున్నాడు. "ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, నా ఆటను పూర్తిగా గమనించే సమయం ఆయనకు లేకపోయి ఉండొచ్చనిపిస్తుంది. మా నాన్నకు మర్యాద ఇవ్వడం కోసం ఏదో చెప్పి ఉంటారు. అప్పుడు మా నాన్న ఆ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు. కానీ నేను అలా తీసుకోలేదు" అని యువీ తన పరిణతిని చాటుకున్నాడు. ప్రస్తుతం యువరాజ్ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Yuvraj Singh
Yuvraj Singh retirement
Indian cricketer
2011 World Cup
Sania Mirza
cricket podcast
mental health
sports motivation
Indian cricket team
retirement reasons

More Telugu News