Andhra Pradesh High Court: ఏఐ టెక్నాలజీతో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయాధికారి.. ఏపీ హైకోర్టు కీలక హెచ్చరికలు

AP High Court cautions judges on using AI technology
  • అన్ని రంగాల్లోకి శరవేగంగా వచ్చేస్తున్న ఏఐ
  • ఉత్తర్వులు, తీర్పుల విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దన్న హైకోర్టు
  • ఏఐ సమాచారంలో చట్టపరంగా తప్పులు ఉండవచ్చని హెచ్చరిక
ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ శరవేగంగా చొచ్చుకొస్తోంది. ప్రజలకు అవసరమైన ఎన్నో సూచనలు, సలహాలను ఏఐ ఇస్తోంది. కీలకమైన వైద్య, న్యాయ రంగాల్లో సైతం ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సాయంతో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐని వినియోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఏఐని వాడటంపై చాలా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు, తీర్పుల విషయంలో ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దని సూచించింది. ఏఐ ఇచ్చే సమాచారం నమ్మదగినదిగా కనిపించినప్పటికీ... దాన్ని యథాతథంగా అమలు చేసే ప్రయత్నం చేయవద్దని తెలిపింది. ఏఐ ఇచ్చే సమాచారంలో చట్టపరంగా తప్పులు ఉండే అవకాశం ఉందని చెప్పింది. 

కొన్ని సందర్భాల్లో కేసుకు సంబంధం లేని తీర్పులను ఏఐ ఉదహరిస్తోందని, అసలు ఉనికిలో లేని తీర్పులను కూడా సృష్టిస్తోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐని గుడ్డిగా నమ్మి మనం తప్పులు చేస్తే... న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. 

విచారణ సందర్భంగా, ఏఐ సాయంతో ఉత్తర్వులను ఇచ్చిన సదరు న్యాయాధికారి మాట్లాడుతూ... తాను ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని తీర్పులు ఏఐ సూచించినవేనని కోర్టుకు తెలిపారు. తాను తొలిసారి ఏఐని వాడానని, ఈ కారణంగానే పొరపాటు జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. తన ఉత్తర్వుల్లో అన్వయించిన చట్టసూత్రం మాత్రం సరైనదేనని కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో, ఏఐని వినియోగించే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హైకోర్టు సూచించింది.
Andhra Pradesh High Court
AI technology
artificial intelligence
court orders
legal system
justice system
court judgements
AP High Court
AI in law
judicial error

More Telugu News