హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాల నివారణకు 'హైడ్రా' కఠిన చర్యలు.. సెల్లార్లు వాడితే తాళాలే!

  • సెల్లార్లను గోదాములుగా వాడితే భవనాలకు తాళాలు వేస్తామని హెచ్చరిక
  • నిబంధనలు మీరితే భవనాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
  • ఉల్లంఘనలపై వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపు
  • నాంపల్లి అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వాటి నివారణకు 'హైడ్రా' కఠిన చర్యలకు ఉపక్రమించింది. నగరంలోని వాణిజ్య భవనాలు, షాపింగ్ మాల్స్‌లో అగ్నిమాపక భద్రతా నిబంధనల అమలుపై నేటి నుంచే ప్రత్యేక తనిఖీలు చేపట్టనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే భవనాలకు తాళాలు వేయడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.

ఇటీవల నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదమే ఈ కఠిన నిర్ణయాలకు కారణమైంది. పార్కింగ్ కోసం ఉద్దేశించిన సెల్లార్‌ను గోదాముగా మార్చి, మండే స్వభావం ఉన్న వస్తువులను నిల్వ చేయడంతోనే ప్రాణ నష్టం తీవ్రత పెరిగిందని సమీక్షలో తేలింది. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని వాణిజ్య సంస్థలు తమ సెల్లార్లను వెంటనే ఖాళీ చేసి, కేవలం పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో సెల్లార్లను గోదాములుగా వాడుతున్నట్లు తేలితే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

బుద్ధభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని భవనాల ముందు 'ప్రమాదకరం' అని బోర్డులు ఏర్పాటు చేయాలని, వాటికి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. మెట్లు, కారిడార్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను ఖాళీగా ఉంచాలని, ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేసే స్థితిలో ఉండాలని స్పష్టం చేశారు.

గతేడాది నగరంలో నెలకు సగటున మూడు చొప్పున 36 భారీ అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళనకరమని కమిషనర్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలు, గోదాముల సమాచారాన్ని ఫొటోలు, వీడియోలతో 90001 13667 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సంద‌ర్భంగా నివాస ప్రాంతాల్లో మండే స్వభావం ఉన్న వస్తువులను నిల్వ చేసే గోదాములపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయన హెచ్చరించారు.


More Telugu News