Madhu Ghattumukkala: అమెరికా సైబర్ చీఫ్ ‘చాట్ జీపీటీ’ నిర్వాకం.. సెన్సిటివ్ ఫైల్స్ అప్‌లోడ్ చేసి అడ్డంగా దొరికిన వైనం

Madhu Ghattumukkala Uploads Sensitive Files to ChatGPT
  • దేశ రక్షణకు సంబంధించిన కీలక ఫైళ్లు బహిరంగం
  • చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేసిన మధు గొట్టుముక్కల
  • తనకున్న అధికారంతో చాట్ జీపీటీ యాక్సెస్ పొందిన వైనం
  • హ్యాకర్ల నుంచి కాపాడాల్సిన వారే డేటాను బహిర్గతం చేయడంపై విస్మయం
  • సీఐఎస్ఏ అంతర్గత సెన్సార్లు అప్‌లోడ్‌ను గుర్తించడంతో బయటపడ్డ విషయం
అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ) తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న భారత సంతతికి చెందిన మధు గొట్టుముక్కల ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దేశ సైబర్ రక్షణ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సిన ఆయనే సున్నితమైన ప్రభుత్వ పత్రాలను పబ్లిక్ వెర్షన్ 'చాట్ జీపీటీ'లో అప్‌లోడ్ చేసి భద్రతా హెచ్చరికలు పెంచారు.

ట్రంప్ ప్రభుత్వ హయాంలో గతేడాది మేలో మధు గొట్టుముక్కల ఈ కీలక బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరిన వెంటనే ఆయన తన శాఖలోని ఐటీ విభాగంపై ఒత్తిడి తెచ్చి చాట్ జీపీటీ వాడకంపై తనకు మాత్రమే ప్రత్యేక మినహాయింపు తీసుకున్నారు. వాస్తవానికి భద్రతా కారణాల దృష్ట్యా ఇతర ఉద్యోగులెవరికీ దీనిని వాడే అనుమతి లేదు. అయితే, తనకు లభించిన ఆ యాక్సెస్‌ను ఆయన దుర్వినియోగం చేస్తూ.. ‘అధికారిక ఉపయోగం కోసం మాత్రమే’ అని ముద్ర ఉన్న కాంట్రాక్ట్ దస్త్రాలను చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేశారు.

ఆయన పత్రాలను అప్‌లోడ్ చేసిన వెంటనే ఏజెన్సీలోని సైబర్ సెన్సార్లు ఆటోమేటిక్ అలర్ట్ ఇచ్చాయి. పబ్లిక్ ఏఐ టూల్స్ లో ఇలాంటి డేటా ఉంచడం వల్ల ఆ సమాచారం అంతా వాటి సర్వర్లలో స్టోర్ అవుతుందని, ఇది దేశ భద్రతకు ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆగస్టు మొదటి వారంలోనే ఆయనకు సంబంధించి ఇలాంటి పలు సెక్యూరిటీ వార్నింగ్‌లు వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

ఈ ఉదంతం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హ్యాకర్ల నుంచి దేశాన్ని కాపాడాల్సిన వ్యవస్థకు నాయకత్వం వహిస్తూ, ఇంత చిన్న స్థాయి పొరపాటు ఎలా చేస్తారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అంతర్గత విచారణ జరుపుతోంది. ఈ పొరపాటు వల్ల దేశ భద్రతకు ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే అంశాన్ని అధికారులు విశ్లేషిస్తున్నారు.  
Madhu Ghattumukkala
CISA
Cybersecurity
ChatGPT
Data breach
Cyber security incident
US cyber security
Cybercrime
Data privacy
Cyber attack

More Telugu News